
ప్రభుత్వ కనుసన్నల్లో ట్విట్టర్ హ్యాకింగ్ !
ప్రభుత్వ ప్రాయోజిత శక్తులే హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశముందని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ తన ఖాతాదారులను హెచ్చరించింది. హ్యాకింగ్ ముప్పు పొంచి ఉండటంతో సైట్ భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసింది. ట్విట్టర్ ఈ తరహాలో భద్రతాపరమైన హెచ్చరిక జారీ చేయడం ఇదే మొట్టమొదటిసారి. అది కూడా కొద్దిమంది ఖాతాదారులకు మాత్రమే ఈ హెచ్చరికలు అందినట్టు తెలుస్తున్నది. కెనడాకు చెందిన స్వచ్ఛంద సంస్థ కోల్‌ఢాక్ తమకు ట్విట్టర్ నుంచి అందిన వార్నింగ్ కాపీని పోస్టు చేసింది.
'ప్రభుత్వ ప్రాయోజిత శక్తులే హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశమున్న చిన్న గ్రూపుల్లో మీరు కూడా ఉన్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ హెచ్చరిక పంపుతున్నాం' అని అందులో ట్విట్టర్ స్పష్టంగా తెలియజేసింది. ప్రభుత్వ అనుబంధమున్న శక్తులు ఈమెయిల్ అడ్రస్, ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్లు వంటి సమాచారాన్ని చోరీ చేసే అవకాశముందని పేర్కొంది. మీ అకౌంట్‌ను సమాచారాన్ని ఎవరైనా దొంగలించారా? అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. దేశ భద్రత కోసమంటూ అమెరికాకు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2.2 కోట్లమంది ప్రజల వ్యక్తిగత ఖాతాల్లోకి అక్రమంగా చొరబడిన ఘటన గత ఏడాది వెలుగుచూసిన సంగతి తెలిసిందే. భద్రత, ఇతరత్రా సాకులతో ప్రజల వ్యక్తిగత ఖాతాల్లోకి విదేశీ ప్రభుత్వాలు అక్రమంగా చొరబడుతూ హ్యాకింగ్‌కు పాల్పడుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్విట్టర్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.