ఆ చెత్త సెల్ఫీ జంటను ఎట్టకేలకు విడిచిపెట్టారు!
దుబాయ్: కొత్త సంవత్సరం సందర్భంగా దుబాయ్‌లో ఓ హోటల్ తగలబడుతుండగా.. దాని ముందు తాపీగా నిలబడి సెల్ఫీ తీసుకున్న ఓ జంటకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను విడుదల చేసినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ శుక్రవారం తెలిపింది. దుబాయ్ ఎమిరెట్స్ అటార్నీ జనరల్ ఎస్సాం అల్ హుమైదన్‌ను ఉటంకిస్తూ ప్రభుత్వ వార్తాసంస్థ డబ్ల్యూఏఎం ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్న 64 అంతస్తుల హోటల్‌లో డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. నూతన సంవత్సరం వేడుకలకు కొద్దిముందే జరిగిన ఈ ప్రమాదంతో హోటల్‌లోని వారు ఉరుకులు, పరుగులతో హాహాకారాలు చేశారు. ఈ సమయంలో ఓ జంట మాత్రం కాలుతున్న హోటల్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంది. 2015లో ఇదే అత్యంత చెత్త సెల్ఫీ నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే వారికి ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని తెలియడంతో వదిలేశారు. అనుమతి లేకుండా సంబంధిత సంస్థలు, వ్యక్తుల ఫొటోలు తీయడం దుబాయ్‌లో నేరం. ఇందుకు అరెస్టుచేసి జైల్లో వేసే అవకాశం కూడా ఉంది. అయితే ఆ జంటను అరెస్టు చేయడం పనిలేని వ్యవహారమని దుబాయ్ రాజకీయ పరిశీలకులు పోలీసుల చర్యను తప్పుబట్టారు.