లండన్: లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను ఉంచాలనుకుంటున్న ముంబైలోని జైలు గదిని పూర్తిగా వీడియో తీసి తమకు సమర్పించాలని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించిన తర్వాత ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సెప్టెంబర్ 12న వాదనలు ముగియనున్నాయి. మంగళవారం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యా కేసు విచారణకు వచ్చింది. భారత్‌లోని జైళ్ల్లలో మౌలిక సదుపాయాలు సరిగా ఉండవని, సహజసిద్ధమైన వెలుతురు, పరిశుభ్రమైన గాలి ఉండదని మాల్యా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ముంబై సెంట్రల్ జైలులోని 12వ గదికి సంబంధించిన ఫొటోలను భారత్ అధికారులు కోర్టుకు సమర్పించారు.
కాగా, ఈ ఫొటోలను ఆధారంగా చేసుకుని విచారణ జరపలేనని వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి ఎమ్మా ఆర్బర్‌నాట్ పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఆ 12వ గదిలోని అణువణువునూ వీడియో తీసి సమర్పించాల్సిందిగా ఆమె భారత అధికారులను ఆదేశించారు. ఎవరైనా వ్యక్తి ఫొటోలో ఉన్న తలుపు ద్వారా జైలులోకి వెళుతుండగా వీడియో తీయాలని జడ్జి చెప్పారు. అది కూడా మధ్యాహ్నం సమయంలో తీయాలని, దీంతో సూర్యకిరణాలు ఆ గదిలో పడుతున్నాయా లేదా అనేది తెలుస్తుందని పేర్కొన్నారు. జైలు పరిస్థితులు మానవ హక్కుల కమిషన్ నిబంధనల మేరకే ఉన్నాయని భారత్ వాదించింది. అలాగే మాల్యాబెయిల్‌ను సెప్టెంబర్ 12 వరకు కోర్టు పొడిగించింది. మాల్యా బ్యాంకులకు 9వేల కోట్లు ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment