లండన్ : కరోనా మహమ్మారి నిర్మూలనే లక్ష్యంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 800 మంది వాలంటీర్లను కూడా ఎంపిక చేసింది. తొలుత ఇద్దరిపై ట్రయల్స్ మొదలుపెట్టగా.. అందులో మొదటగా 32 ఏళ్ల మైక్రో బయాలజిస్ట్ ఎలీసా గ్రానటో వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఎలీసా మరణించారని.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు విఫలమయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎలీసా ఖండించారు. తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు.
స్వచ్ఛందంగా ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎలీసా చెప్పారు. తన పుట్టిన రోజునాడే వ్యాక్సిన్ తీసుకున్నానని.. ఇప్పుడు క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. ‘నేను బతికే ఉన్నాను. నేను ఈరోజు(26 ఏప్రిల్) టీ తాగుతున్నాను. ఇవాల్టికి నా బర్త్‌డే జరిగి మూడు రోజులు అవుతుంది. నేను వ్యాక్సిన్ తీసుకుని కూడా మూడు రోజులు గడిచింది. నేను బాగానే ఉన్నాను. వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రపంచంలోని అందరూ కూడా బాగానే ఉన్నారని భావిస్తున్నాను’ అని తెలిపారు. ఎలీసా మరణించారని జరిగిన తప్పుడు ప్రచారంపై యూకే ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందించింది. ఆ వార్తలు నిరాధామైనవని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం యూకే హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. ఎలీసా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది.
అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ప్రతినిధి ఫెర్గస్ వాల్ష్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న మొదటి వాలంటీర్ ఎలీసా మరణించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. నేను ఈ రోజు ఉదయం కొద్ది నిమిషాల పాటు ఎలీసాతో స్కైప్ ద్వారా చాట్ చేశాను. ఆమె బతికే ఉన్నారు.. అలాగే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు నాకు చెప్పారు. ప్రస్తుతం ఆమె తన బంధువులందరితో చాట్ కూడా చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. అలాగే ఎలీసా మాట్లాడుతన్న వీడియోను కూడా షేర్ చేశారు.
....and here is Dr Elisa Granato in person. Alive and well pic.twitter.com/Csw1WqmBQa
— Fergus Walsh (@BBCFergusWalsh) April 26, 2020
Comments
Please login to add a commentAdd a comment