
హూస్టన్: విశ్వంలో గతి తప్పి భూమి వైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ గురించి సైంటిస్టులు ఎంతో ముందుగానే అంచనా వేస్తారు. అది ఎప్పుడు భూమిని దాటి వెళ్తుందన్న దానిపై ఓ స్పష్టత ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మొన్న వీకెండ్‌లో ఓ ఫుట్‌బాల్ మైదానమంత సైజు ఉన్న ఆస్టరాయిడ్ భూమి పక్కగా వెళ్లిందని చాలా మందికి తెలియదు. నాసా శాస్త్రవేత్తలకే అది వచ్చే కొన్ని గంటల ముందు తెలిసింది. ఆరిజోనాలోని నాసా అబ్జర్వేటరీలో ఉన్న సైంటిస్టులు 21 గంటల ముందే అది భూమి వైపు దూసుకొస్తున్నదని గుర్తించారు.
2018 జీఈ3 అనే ఈ ఆస్టరాయిడ్ ఈస్టర్న్ డేలైట్ టైమ్ ప్రకారం ఆదివారం 12.11 గంటలకు భూమికి దగ్గరగా వచ్చినట్లు స్పేస్ డాట్ కామ్ వెబ్‌సైట్ వెల్లడించింది. గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లింది. ఇది 48–110 మీటర్ల వెడల్పు ఉన్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టి ఉంటే.. ఓ ఖండమంతా నాశనమయ్యేదని స్పేస్ వెబ్‌సైట్ తెలిపింది. ఇది 1908లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో పడిన ఆస్టరాయిడ్ కంటే 3.6 రెట్లు పెద్దది కావడం గమనార్హం. అప్పట్లో ఈ ఆస్టరాయిడ్ హిరోషిమాపై పడిన అటామిక్ బాంబ్ కంటే 185 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment