న్యూ యార్క్ : జెరుసలేం విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలు ఒక్కటవ్వడాన్ని అగ్రరాజ్యం సహించలేకపోతోంది. జెరూసలేం నిర్ణయంపై వ్యతిరేకంగా ఓటేసిన దేశాలకు విడుదల చేసే నిధులపై కోత పెడతామంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా.. మొదటి షాక్ ఐక్యరాజ్య సమితికే ఇచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక ప్రకటన ఒకటి చేశారు.
ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల కోసం 2018-19 మధ్యకాలంలో కేటాయించే నిధుల్లో 285 మిలియన్ డాలర్ల కోత పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచదేశాలన్నీ అమెరికాను ఒంటరి చేశాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా షాక్‌తింది. ఐక్యరాజ్య సమితి సమర్థత, ఆర్థిక అంశాలపై మాకు స్పష్టమైన అవగాహన వుంది.. మేం చేయాలనుకున్నది చేస్తామని నిక్కీ హేలీ స్పష్టం చేశారు.
అమెరికన్ల ప్రేమ, ఔదార్యాన్ని మిగిలిన దేశాలు కూడా ఏంతోకాలం పొందలేవని ఆమె చెప్పారు. ఇదిలావుండగా.. సమితికి కేటాయించే మొత్తం బడ్జెట్ నిధులను నిలిపేస్తున్నారా? లేక సమితి నిర్వహణ కోసం అందించే ఉదార నిధులును అమెరికా రద్దు చేసిందా అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది.
జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తున్నామని, అమెరికన్ ఎంబసీని జెరూసలేంకు మార్చుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజులు క్రితం ప్రకటించారు. ముస్లిం దేశాల్లో అల్లర్లు, ఆందోళనలు చెలరేగాయి. దీంతో అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పప్రపంచదేశాలన్నీ సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి 128 దేశాల మద్దతుల లభించింది. సర్వసభ్య సమావేశం తరువాత నిక్కీ హేలీ చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘అమెరికా చరిత్రలో ఇది మరచిపోలేని రోజు.. అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన అన్నీ దేశాలను గుర్తుపెట్టుకుంటాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన అనంతరం నిధుల కోతపై నిక్కీ హేలీ రోజుల వ్యవధిలోనే ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment