కఠ్మాండు : నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం కఠ్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది ప్రయాణికులు మరణించినట్టు సమాచారం. మరో 20 మంది ప్రయాణికులను సహాయక సిబ్బంది కాపాడి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఢాకా నుంచి వచ్చిన విమానం.. ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. విమానం క్రాష్‌ల్యాండ్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక బృందాలు విమానంలో ఎగిసిన మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 20మంది ప్రయాణికులను కూలిన విమానం నుంచి కాపాడామని, మరింతమందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నేపాల్ ఆర్మీ తెలిపింది.
నలుగురు సిబ్బంది, 67మంది ప్రయాణికులు సహా మొత్తం 71మంది విమానంలో ఉన్నారు. వారిలో 50 మంది ప్రయాణికులు మృతిచెందారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. సహాయకర చర్యలు కొనసాగుతున్నాయని, కూలిన విమానంలో ప్రాణాలతో ఉన్న కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.
తమ కళ్లముందే విమానం క్రాష్‌ల్యాండ్ అయిందని, ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిశాయని ఎయిర్‌పోర్టులో ఆ సమయంలో ఉన్న పలువురు ప్రయాణికులు ట్వీట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment