విదేశీయులకు అమెరికా ఉపశమనం
న్యూఢిల్లీ: విమానమార్గంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకు అమెరికా కాస్తంత ఉపశమనం కల్పించింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో అమెరికాకు వచ్చే విదేశీయులు తమ ల్యాప్‌టాప్స్‌ను వెంట తెచ్చేకునేందుకు అమెరికా అనుమతినిచ్చింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే తమ విమానాల్లో ల్యాప్‌టాప్‌లను అనుమతిస్తారని ఎమిరేట్స్ సంస్థ బుధవారం ప్రకటించింది. ఇస్తాంబుల్‌లోని ఆటాటర్క్ విమానాశ్రయం నుంచి అమెరికాకు వెళ్లే తమ విమానాల్లో ప్రయాణికులు తమ ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ స్పష్టంచేసింది.
ఉగ్రవాద దాడుల భయంతో ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమానాల్లో వచ్చే ప్రయాణికులపై మార్చి నెలలో అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విమానం క్యాబిన్ బ్యాగుల్లో పెట్టి తీసుకురాకుండా ఆంక్షలు పెట్టింది. ఈ నిబంధనల ప్రభావం ఈజిప్ట్ ఎయిర్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్, ఖతార్ ఎయిర్‌వేస్, రాయల్ ఎయిర్ మొరాక్, రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్, సౌదీఅరేబియన్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై పడింది. తాజాగా నిబంధనలను సడలించిడంతో ఎమిరేట్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు ఉపశమనం కలిగింది.