వాషింగ్టన్ : ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న ధోరణని అమెరికా నిశితంగా గమనిస్తోందని.. ఆదేశ రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ స్పష్టం చేశారు. దక్షిణాసియా, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని అణిచేందుకు అమెరికా అమలు చేస్తున్న వ్యూహాల్లో పాక్ నిజాయితీ కలిగిన భాగస్వామిగా చేరుతుందా? లేదా? అన్నది ఆ దేశానికే వదిలేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి అన్ని రకాలు భారత్ నిజాయితీతో కృషి చేస్తోందని ఆయన ప్రకటించారు. ఆఫ్టనిస్తాన్ ప్రజలకు నిరంతరం భారత్ తన సహాయ సహకారాలను అందిస్తోందని మాటిస్ కొనియాడారు.
ఆఫ్ఘన్‌లోని ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. న్యూ ఆఫ్ఘన్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాద సంస్థలకు, గ్రూపులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందనే ఆరోపణలున్నాయి. దీనిపై మాటిస్ స్పందిస్తూ.. ట్రంప్ పాలసీని పాకిస్తాన్ నిజాయితీతో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ ప్రతిపాదించిన ఆఫ్టన్, దక్షిణాసియా పాలసీని తిరస్కరిస్తున్నట్లు పాకిస్తాన్ స్పస్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పాకిస్తాన్ చేసిన త్యాగాలను అమెరికా మరిచిపోయినట్లుందని పాక్ పేర్కొంది.