పాక్ ‘అణు’ హెచ్చరికలపై అమెరికా ఆగ్రహం
వాషింగ్టన్: భారత్‌తో యుద్ధం వస్తే అణ్వస్త్రాలు వాడతామంటూ పాకిస్థాన్ హెచ్చరించడాన్ని అమెరికా ఆక్షేపించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, మాటలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. భారత్‌కు వ్యతిరేకంగా అణ్వస్త్రాలు వాడుతామని, తమపై యుద్ధానికి వస్తే భారత్‌ను నాశనం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ గత పదిహేను రోజుల్లో రెండుసార్లు హెచ్చరించారు.
ఇలాంటి ప్రకటనలు పాకిస్థాన్ నాయకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అమెరికా విదేశాంగ ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. పాక్ అణు ఆయుధాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. సామూహిక వినాశనానికి దారి తీసే వీటి భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.