గంట నడిస్తే.. రెండున్నర గంటల చార్జింగ్!
మీ సెల్‌ఫోన్ బ్యాటరీ ఖాళీ అయిందా? అందుబాటులో చార్జ్ చేసుకునే అవకాశం లేదా? ఏం ఫరవాలేదు. ఈ బూట్లు వేసుకుని నడిస్తే చాలు.. మీ ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. వీటిని వేసుకుని ఒక గంట నడిస్తే.. రెండున్నర గంటల పాటు ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.
అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు వీటిని తయారు చేశారు. ఇవెలా పనిచేస్తాయంటే.. బూట్ల కింది సోల్‌భాగం లోపల చిన్న జనరేటర్, మెకానికల్ వ్యవస్థ ఉంటుంది. నడిచినప్పుడు ఏర్పడే గతిశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఈ వ్యవస్థ బూటుపైన ఉండే బ్యాటరీకి అనుసంధానమై ఉంటుంది.
ఇంకేం.. నడిచినప్పుడు పుట్టే కరెంటు ఎప్పటికప్పుడు ఈ బ్యాటరీలో నిల్వ అవుతుంది. తర్వాత బ్యాటరీని తీసి కేబుల్ ద్వారా ఫోన్‌కు పెట్టుకోవడమే. వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘సోల్‌పవర్’ కంపెనీ వెల్లడించింది.