నాలుగు కోట్లకు ‘ఫ్లైయింగ్ కారు’
న్యూఢిల్లీ:నెదర్లాండ్స్ చెందిన ‘పాల్-వి యూరప్ ఎన్‌వీ’అనే కంపెనీ ఫ్లైయింగ్ కారుకు భారత్‌లో పేటెంట్ హక్కులు పొందింది. రోడ్డుపైనా పరుగులు తీయడంతోపాటు గాల్లో హెలికాప్టర్‌లా ప్రయాణించే ఈ కారును ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ యూరప్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. విమానయాన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున భారతీయ మార్కెట్‌లో దీన్ని విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న పర్సనల్ ల్యాండ్ అండ్ ఎయిర్ వెహికిల్ (పీఏఎల్-వి)గా పిలిచే ఈ ఫ్లైయింగ్ కారు రోడ్డుపైనా గంటకు గరిష్టంగా 170 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, పది సెకండ్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని, ఇంధనం లీటరుకు 12 కిలోమీటర్లు వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అదే ఆకాశంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, గంటకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రయాణించే సౌకర్యం గల ఈ ఫ్లైయింగ్ కారు ధరను 3.80 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫ్లైయింగ్ కార్లను తయారు చేయాలనే ఆలోచన అమెరికా ఏవియేషన్ అథారిటీ 1917లోనే ఆలోచన చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. స్లొవేకియాకు చెందిన ఎరోమొబైల్ కంపెనీ 2015లోనే రెక్కలుగల ప్లైయింగ్ కారు ప్రొటోటైప్‌ను తయారు చేసింది. అయితే అది ట్రయల్ రన్‌లో క్రాష్ అయింది. ఆ తర్వాత రెక్కలుగల ప్లైయింగ్ కార్లను తయారు చేస్తున్నామని ఎన్నో కంపెనీలు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఏవీ విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ పాల్-వీ ఫ్లైయింగ్ కారుకు రెక్కలకు బదులుగా హెలికాప్టర్లలా రోటర్‌ను ఏర్పాటు చేశారు.