ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?! | Whether He Is A Mother or Dad! | Sakshi
Sakshi News home page

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

Published Thu, Jul 18 2019 3:57 PM | Last Updated on Thu, Jul 18 2019 6:57 PM

Whether He Is A Mother or Dad! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ మ్యాక్‌కనెల్స్‌కు ఇప్పుడు 30 ఏళ్లు. కొన్ని నెలల క్రితమే ఆయన పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఇంతకు ఫ్రెడ్డీ ఆడ, మగా ! అని అనుమానం రావచ్చు. పుట‍్టుకతో ఆడ అయినా లింగ మార్పిడి ద్వారా ఐదేళ్ల క్రితమే మగగా మారిపోయారు. అయితే గర్భాశయాన్ని తొలగించుకోలేదు. బిడ్డను కనడం కోసం అలాగే ఉంచుకున్నారు. ఓ దాత వీర్యంతో ఎంచక్కా తల్లీ–తండ్రీ అయ్యారు. ఇంతకు ఆయన్ని ఆ బిడ్డకు తండ్రని పిలవాలా ? తల్లని పిలవాలా ? ఇది తేల్చుకోవడానికే ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. తన బిడ్డ పేరును రిజిస్టర్‌ చేయడానికి ఆయన ఇటీవల ‘ది జనరల్‌ రిజిస్టర్‌’ ఆఫీసుకు వెళ్లారు. తండ్రిగా తన పేరును చేర్చుకోవాలని ఆయన అక్కడి అధికారులను కోరారు. అక్కడి అధికారులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ‘నీ కడుపు చించుకు పుట్టిన బిడ్డ కనుక, ముమ్మాటికి నీవు తల్లివే’ అంటూ వారు వాదించారు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. 

ఫ్రెడ్డీ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిని. అయినప్పటికీ బాలురు కన్నా ఆమెను చిన్న చూపు చూసేవారట. దాంతో బాలుడిగా పుట్టి ఉంటే బాగుండేది ఎప్పుడూ అనుకునేదట. ఆ ఆలోచనలతోనే ఆమె తన కౌమార దశకు చేరుకున్నారు. ఈడింబర్గ్‌ యూనివర్శిటీలో అరబిక్‌ భాషలో కోర్సు చేశారు. ఆ తర్వాత అధ్యాపక వృత్తిలో చేరారు. అయినప్పటికీ మగవాడినైతే బాగుండేదన్న భావన మాత్రం బుర్రలోనుంచి పోలేదట. లింగ మార్పిడి ఆపరేషన్లపై అవగాహన ఏర్పరుచుకొని అందుకు అవసరమైన ‘టెస్టోస్టెరోన్‌ (లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఉత్ప్రేరకం)’ మాత్రలను మింగడం మొదలు పెట్టారు. కొంతకాలం తర్వాత బ్రెస్ట్‌ను తొలగించుకన్నారు. గర్భాశయం తీయించుకోవాలని అనుకున్నారు. ఆడ నుంచి మగగా మారినప్పటికీ 2017లో బ్రిటన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన హేడెన్‌ క్రాస్‌ గురించి తెలుసుకుని గర్భాశయాన్ని తొలగించుకోకుండా ఉంచుకున్నారు. లింగ మార్పిడి చేయించుకున్నారు. 

ఫ్రెడ్డీ పూర్తి స్థాయి పురుషుడిగా మారిపోయిన తర్వాత ‘ది గార్డియన్‌’లో మల్టీమీడియా జర్నలిస్ట్‌గా చేరాడు. నవమాసాలు నిండడంతో బిడ్డకు జన్మనించేందుకు ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెల్సిన మిగతా మీడియా, ఆయన బిడ్డకు జన్మ ఇవ్వడాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేయాలనుకుంది. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఫ్రెడ్డీ, ఇది తన ప్రైవసీని ఉల్లంఘించడమంటూ హైకోర్టును ఆశ్రయించారు. ‘వైద్య విజ్ఞానం’పరంగా దీనిని అనుమతించాల్సిందేనంటూ కోర్టు ఆయన విజ్ఞప్తిని కొట్టివేసింది. దాంతో అప్పుడు బ్రిటీష్‌ టీవీలు ఆయన బిడ్డకు జన్మనివ్వడాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేశాయి. 



బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి ఫ్రెడ్డీలాగా  తండ్రయిన వారు హేడెన్‌ క్రాస్‌ ఒక్కరే కాదు. అంతకు కొన్ని నెలల ముందు స్కాట్‌ పారికర్, అంతకు ఎనిమిదేళ్ల క్రితం జారన్‌ బార్కర్‌ అనే బ్రిటీష్‌ యువకులు బిడ్డలకు జన్మనిచ్చారు. వారికి రాని సమస్య ఫ్రెడ్డీకి రావడమే ఇప్పుడు పెద్ద వార్తయింది. వారంతా తమ బిడ్డకు తల్లులుగానే తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. తాను మగవాడిని కావాలనుకొని, లింగ మార్పిడి చేయించుకొని మగవాడిగా లైసెన్స్‌ను కూడా పొందాక తనను తండ్రిగా గుర్తించనంటే ఒప్పుకొనేది లేదని ఫ్రెడ్డీ వాదిస్తున్నారు. ఇలా ఒప్పుకోక పోవడం కూడా లింగ వివక్షతేనంటూ హైకోర్టుకెక్కారు. ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవిస్తే అయనకు పుట్టిన బిడ్డ ప్రపంచంలోనే ‘తల్లికి కాకుండా తండ్రికి పుట్టిన తొలి బిడ్డ’ అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement