‘టిప్‌’ ఇవ్వడం మంచిదా? కాదా? | why do we give tip | Sakshi
Sakshi News home page

‘టిప్‌’ ఇవ్వడం మంచిదా? కాదా?

Published Thu, Dec 7 2017 2:51 PM | Last Updated on Thu, Dec 7 2017 2:51 PM

why do we give tip - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టిఫిన్‌ చేయడానికో, భోజనం చేయడానికో, సాయం సంధ్య వేళల్లో అలా అహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలసి కాఫీలు, టీలు తాగడానికి హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు లేదా సరదాగా స్నేహితులతో కలసి బీరు తాగేందుకు బార్‌కు వెళ్లినప్పుడు అక్కడి సర్వర్లకు ఎంతో కొంత టిప్‌ చెల్లించడం మనకు అలవాటే. టిప్పులెంత అనేది వినియోగదారుల మనస్తత్వం, వారి జేబు బరువునుబట్టి ఉంటుంది. అంటే, కొంత మంది డబ్బున్న వాళ్లు డాంబికం కోసం టిప్‌ ఎక్కువగా ఇవ్వొచ్చు. కొంత మంది ఎంత డబ్బున్నాసరే తక్కువ టిప్‌తో సరిపెట్టవచ్చు. కొంత మంది అంతంత మాత్రమే డబ్బున్నా ఉదారంగా ఎక్కువ టిప్‌ ఇవ్వొచ్చు. మరికొందరు పక్కనే ఉన్న గర్ల్‌ ఫ్రెండ్‌ లేదా స్నేహితుల మెప్పు కోసం టిప్‌ ఎక్కువగా ఇవ్వొచ్చు. 

అసలు ఈ టిప్‌లు అంటే ఏమిటీ? ఈ సంస్కతి ఎక్కడ పుట్టింది? ఎందుకోసం పుట్టింది? దీని వల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా? అన్న అంశాలపై మరోసారి ఇప్పుడు చర్చ మొదలైంది. టిప్‌ అంటే ‘టు ఇన్సూర్‌ ప్రామ్టిట్యూడ్‌’ అని చెబుతారు. అంటే సకాలంలో లేదా తక్షణమే ఆర్డర్‌ చేసినది అందించడానికని అర్థం. ఇప్పుడు పబ్స్‌గా వ్యవహరిస్తున్న ఒకప్పటి ఇంగ్లీషు హౌసెస్‌లో ఈ టిప్‌ సంస్కతి పుట్టిందట. సకాలంలో మంచి సర్వీసు అందించడం కోసం సర్వర్లకు టిప్‌ లివ్వడం మొదలైంది వాటిలోనే. అనతి కాలంలోనే ఈ సంస్కతి యూరప్‌ అంతటా వ్యాపించింది. 20వ శతాబ్దంలో ఉత్తర అమెరికాకు పాకింది. అక్కడి నుంచి వివిధ దేశాలకు విస్తరించింది. 

మనం ఇచ్చే టిప్‌లకు సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం ఉందా? ఉంటే ఎక్కువ టిప్‌ ఇచ్చిన వారికి ఎక్కువ సర్వీసు, తక్కువ టిప్‌ ఇచ్చిన వారికి తక్కువ సర్వీసు ఉంటుందా? ఇచ్చిన టిప్‌కు, చేసే సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం లేదని, అయితే సర్వర్‌ ఆశించే టిప్‌కు, చేసే సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఓ సర్వేలో తేలింది. ఓ కస్టమర్‌ ఎక్కువ టిప్‌ ఇస్తాడని ఆశించిన సర్వర్‌ ఆయనకు మంచి సర్వీసు అందించవచ్చు. ఆ..బేవార్స్‌ బ్యాచీ! టిప్‌ పెద్దగా ఇవ్వరని సర్వర్‌ భావిస్తే వారికి మంచి సర్వీసు అందించక పోవచ్చు. ధరించిన దుస్తులు, ముఖ కవలికలనుబట్టి ఎవరు ఎక్కువ ఇస్తారో, తక్కువ ఇస్తారో సర్వర్లు ఊహించవచ్చు. అప్పుడప్పుడు వారి ఊహలు తారుమారు కావచ్చు. ఇక్కడ మంచి సర్వీసంటే వేగంగా సర్వ్‌ చేయడమే కాకుండా, కస్టమర్లకు నచ్చిన చట్నీలనో, కూరలనో అడక్కముందే అందించడం, ఉన్నంతలో వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆహార పదార్థాలను వేడి వేడిగా సర్వ్‌ చేయడం.

తరచుగా వచ్చే కస్టమర్లు ఎక్కువ టిప్‌ ఇస్తారంటే మంచి సర్వీసు, ఇవ్వరనుకుంటే సర్వర్లు నింపాది సర్వీసు ఇవ్వొచ్చు. వాస్తవానికి ఈ టిప్‌ల వల్ల సర్వీసు దెబ్బతింటుందని, ఓ సర్వర్‌కు టిప్‌ వందొస్తే చాలనుకుంటే ఆ సర్వర్‌ వంద చేతిలో పడగానే పనిచేసే చోటు నుంచి వెళ్లిపోతాడని, దాని వల్ల సర్వీసుకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పిన వాళ్లు ఉన్నారు. సర్వర్లకు టిప్‌లు ఇవ్వడం వల్ల వారి యజమానులు వారి జీతాలను పెంచడం లేదని, అందుకని వినియోగదారులు టిప్‌లు ఇవ్వడం మానేస్తే యజమానులు చచ్చినట్లు సర్వర్ల జీతాలు పెంచుతారనే బలమైన వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. 

వాస్తవానికి ఈ వాదనను కూడా తప్పని తేల్చిన వారు ఉన్నారు. వినయోగదారుల నుంచి టిప్‌లు తగ్గిపోయాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని యజమానులు  సర్వర్లకు జీతాలు పెంచాలని ఆలోచించరట. మార్కెట్‌లో సర్వర్లు ఎంతకు దొరుకుతున్నారనే అంశంపైనే ఆధారపడి ఉంటుందట వారి జీతభత్యాలు. ఇంకా టిప్‌లు రాకపోతే సర్వర్‌ ఉద్యోగం బాగాలేదని, మరో ఉద్యోగానికి సర్వర్లు వెళతారట. అలా సర్వర్ల కొరత ఏర్పడితే తప్పించి యజమానులు వారికి ఎక్కువ జీతాలు ఇవ్వడానికి ఇష్టపడరట! పైగా టిప్‌ల సంస్కతి వల్ల తినుబండారాల ధరలు స్థిరంగా ఉంటున్నాయనే వాదన కూడా ఉంది. సర్వర్ల జీతాలను వినియోగదారులు టిప్‌ల రూపంలో షేర్‌ చేసుకోవడం వల్లన యజమానులు తినుబండారాల ధరలను పెంచడం లేదట. సర్వర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తే యజమానలు కచ్చితంగా తినుబండారాల ధరలను పెంచుతారనే విషయం తెలిసిందే. 

ఇలాంటి పరిస్థితుల్లో టిప్‌ల సంస్కతికి తిలోదకాలివ్వాలా, లేదా ? అన్న అంశంపై ‘టొరాంటో స్టార్‌ రీడర్స్‌’ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా 85 శాతం మంది వీటికి గుడ్‌బై చెప్పాలని తేల్చారు. ఎలా గుడ్‌బై చెప్పాలి? వినియోగదారుల్లో చైతన్యం తీసుకరావాలా? యజమానుల వైఖరిలో మార్పు రావాలా? ఇరువురి వైఖరిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమని, అదికూడా అంత సులువుకాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాలతోపాటు, భారత్‌లో కూడా కొన్ని హోటళ్లు సర్వర్లకు టిప్‌లు ఇవ్వొద్దని, తామే బిల్లులో టిప్‌ వేసి సర్వర్లకు ఇస్తామని ముందుకు వచ్చాయి. కొన్ని హోటళ్లు టిప్‌ల స్థానంలో సర్వీసు చార్జీలను తీసుకొచ్చాయి. అయితే ఆ పద్ధతులు సక్కెస్‌ అయిన దాఖలాలు లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫైల్‌ రెస్టారెంట్‌ గ్రూపైన ‘డాని మేయర్స్‌ యూనియన్‌ స్క్వేర్‌ హాస్పిటాలిటీ గ్రూప్‌’ టిప్‌లను నిర్ద్వంద్వంగా రద్దు చేసింది. సత్ఫలితాలు కాకుండా మిశ్రమ ఫలితాలు వచ్చాయని ఆ గ్రూప్‌ తెలియజేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement