
చుక్క ఇంధనం లేకుండా.. ప్రపంచయాత్ర!
ఇదివరకే పలుసార్లు విజయవంతంగా గగనవిహారం చేసిన ప్రపంచ తొలి సౌర విమానం 'సోలార్ ఇంపల్స్' మొదటిసారిగా ప్రపంచయాత్రకూ శ్రీకారం చుట్టింది. సోమవారం అబుదాబీ నుంచి సోలార్ ఇంపల్స్-2(ఎస్‌ఐ-2) సౌర విమానం చరిత్రాత్మక ప్రయాణం మొదలెట్టింది. చుక్క ఇంధనం లేకుండా.. 35 వేల కి.మీ. సాగే ఈ సుదీర్ఘయాత్రకు తొలి పైలట్‌గా సోలార్ ఇంపల్స్ సీఈవో బోర్ష్‌బర్గ్.. రెండో పైలట్‌గా సంస్థ సహ వ్యవస్థాపకుడు పికార్డ్ వ్యవహరిస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ విమానం ఐదు నెలల్లో 25 రోజుల పాటు ఎగరనుంది. జూలై చివరలో ఈ విమానం తిరిగి అబుదాబీకి చేరుకోనుంది.
ఇవీ విశేషాలు...
- విమానంలో సీటు ఒకటే. బరువు 2,300 కిలోలే. ఖాళీ బోయింగ్(1.80 లక్షల కిలోలు)తో పోల్చితే ఇది నామమాత్రమే.
- ఒక్కో రెక్క పొడవు 72 మీటర్లు. బోయింగ్ 747 విమానం కన్నా దీని రెక్కలే పెద్దవి.
- సౌరశక్తితోనే నడుస్తుంది. రెండు రెక్కలపై కలిపి 17, 248 సోలార్ సెల్స్ ఉంటాయి.
- సౌరశక్తితో నడిచే 4 ఎలక్ట్రికల్ మోటార్లు ప్రొపెల్లర్స్‌ను తిప్పుతాయి. సౌరశక్తిని నిల్వ చేసేందుకు నాలుగు లిథియం పాలిమర్ బ్యాటరీలు ఉంటాయి.
- కార్బన్ ఫైబర్‌తో తయారైన ఇంపల్స్ గరిష్ట వేగం ప్రస్తుతం గంటకు 45 కి.మీనే!
- సముద్రంపై పగలు 8,500 మీటర్లు, రాత్రి 1,500 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది.
- పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా సాగే ప్రయాణం ఎక్కడా ఆగకుండా ఐదు రాత్రులు, ఐదు పగళ్లూ సాగనుంది. ఈ ఐదు రోజులూ పైలట్ ఒక్కరే!
- పైలట్ వెనక్కి వాలడం తప్ప సీట్లోంచి లేచేందుకు వీలు కాదు. కాలకృత్యాలకు వీలుగా పైలట్ సీటును రూపొందించారు.
- కాక్‌పిట్‌లో ఏసీ ఉండదు కాబట్టి.. పైలట్‌కు ఉక్కపోత, చలి తప్పదు. పైలట్ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఇతర సమాచారం నిరంతరం కంట్రోల్ రూంకు చేరుతుంది.
- ఎస్‌ఐ-2 నేడు(మంగళవారం) అహ్మదాబాద్‌కు చేరుకుం టుంది. వారణాసిలో కూడా ఆగుతుంది.
- అబుదాబీ నుంచి మస్కట్, ఒమన్, భారత్, చైనా, మయన్మార్, హవాయి, ఫీనిక్స్, అరిజోనా, న్యూయార్క్, మొరాకోల మీదుగా ప్రయాణించి తిరిగి అబుదాబీకి చేరుకుని ప్రపంచయాత్రను ముగించనుంది.