
బాలనర్తకి అవార్డును స్వీకరిస్తున్న అనన్య
ఖమ్మంకల్చరల్: ఆ చిన్నారి వయసు ఏడేళ్లు మాత్రమే. కానీ, ఆ చిన్నారి చేసే నాట్యం ఆమెను అత్యున్నస్థాయిలో నిలబెట్టింది. కూచిపూడి.. భరతనాట్యం.. జానపద నృత్యాలు ఎందులోనైనా తన ప్రతిభతో ఆకట్టుకుంటుంది. ఐదేళ్ల వయస్సులో కూచిపూడి నాట్యంతో అరంగేట్రం చేసిన అనన్య రెండేళ్లు తిరగకముందే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ వయస్సులోనే బాలనర్తకి, నర్తనబాల లాంటి పలు బిరుదులు సాధించి ఔరా అనిపించింది. ఖమ్మం నగరానికి చెందిన కిలారు హన్మంతరావు, నీరజల ఏకైక కుమార్తె అనన్య. వారి తల్లిదండ్రులకు నాట్యంపైన ఉన్న అభిమానంతో తొలుత ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షకుడు మాధవరావు దగ్గర శిక్షణలో చేర్పించారు. ఆ తర్వాత ఏలూరి మీనా వద్ద కూచిపూడి నృత్యంలో పూర్తిస్థాయి శిక్షణ పొందింది. ప్రస్తుతం అశోక్ అనే కేరళకు చెందిన మాస్టర్ వద్ద భరతనాట్యంలో, ఉమ అనే డ్యాన్సర్ వద్ద జానపద నృత్యాల్లో శిక్షణ పొందుతోంది. ఏకకాలంలో మూడు నృత్యాలకు సంబంధించిన శిక్షణ పొందుతూ ముందుకు సాగుతోంది. ఇటీవల గోవాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 150 మందిలో సబ్‌జూనియర్స్‌లో మొదటి విజేతగా నిలిచి రష్యాలో మార్చిలో జరగబోయే అంతర్జాతీయ ప్రదర్శనలకు ఎంపికై అందరినీ ఆశ్చర్యపర్చింది.
ప్రశంసల జల్లు
అనన్య నాట్యం చూసిన ఎంతోమంది ఆ చిన్నారిని ప్రశంసల్లో ముంచెత్తారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, శివపార్వతి, గొల్లపూడి మారుతీరావు, రాళ్లపల్లి లాంటి సినీ ప్రముఖులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పోంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మేయర్ పాపాలాల్ లాంటి రాజకీయ రంగ ప్రముఖులు ఇలా ఇంకా అనేక మంది అనన్య నృత్యం చూసి ముగ్ధులయ్యారు.
♦ అనన్య పొందిన అవార్డులు
♦ 2016 భద్రాద్రి బాలోత్సవ్‌లో కూచిపూడిలో తృతీయ స్థానం
♦ 2016 మధిర బాలోత్సవ్‌లో ప్రథమ స్థానం
♦ 2017లో తెలంగాణ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం
♦ 2017 ఆగస్టులో నేషనల్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ–కర్ణాటక వారిచే ఉత్తమ బెస్ట్ డ్యాన్సర్ అవార్డు
♦ 2017 జూలైలో వరసిద్ధి కళాక్షేత్రం–చిత్తూరు వారిచే నాట్యనవకుసుమం అవార్డు
♦ తెలుగు బుక్‌ఆఫ్ రికార్డ్స్ వారి శతబాల పురస్కారం
♦ గతేడాది జరిగిన ఖమ్మం బాలోత్సవ్‌లో భరతనాట్యం, జానపద నృత్యాల్లో మొదటి, తృతీయ స్థానాలు
♦ హైదరాబాద్ రవీంద్రభారతి భారత్ ఆర్ట్స్ అకాడమీ వారిచే నర్తనబాల అవార్డును పొందింది.
♦ 2017 డిసెంబర్‌లో హైదరాబాద్ కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో భరతనాట్యంలో మొదటి బహుమతి సాధించింది.
సుధారామచంద్రన్ స్థాయికి ఎదగాలనేది కోరిక...
ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన సుధారామచంద్రన్ శాస్త్రీయ నృత్యకళాకారిణిగా ఉన్నత స్థాయికి ఎదిగింది. మా గురువుల వద్ద ఆమె గొప్పతనాన్ని తెలుసుకున్నాను. భవిష్యత్‌లో ఉన్నతచదువు చదివి మంచి ఉద్యోగం సాధించడంతోపాటు ఆమెలాగా మంచి పేరును సాధించాలనే ధ్యేయంగా ముందుకుసాగుతాను.- అనన్య, నృత్యకళాకారిణి