జలకన్యల మ్యాజిక్‌? ఈ సీసా రష్యా వరకు వెళ్లింది!! | Girl Message in Bottle Travels from Spain to Russia | Sakshi
Sakshi News home page

జలకన్యల మ్యాజిక్‌? ఈ సీసా రష్యా వరకు వెళ్లింది!!

Published Thu, Jul 4 2019 12:38 PM | Last Updated on Thu, Jul 4 2019 12:41 PM

Girl Message in Bottle Travels from Spain to Russia - Sakshi

స్పెయిన్‌లో పర్యటిస్తున్న సమయంలో నాలుగేళ్ల పాప ఓ సందేశంతో కూడిన చిన్న సీసాను సముద్రంలోకి విసిరేసింది. ఆశ్చర్యకరంగా ఆ సీసా 3,200 కిలోమీటర్లు ప్రయాణించి రష్యా తీరానికి చేరుకుంది. అక్కడ ఆ సీసాను గుర్తించిన ఓ జంట అందులోని సందేశాన్ని చదివి అబ్బురపడటమే కాదు.. ఆ పాపకు బదులు కూడా పంపారు. 

ఇంగ్లండ్‌ సోమర్సెట్‌లోని వెస్టన్‌-సూపర్‌ మారె ప్రాంతానికి చెందిన చిన్నారి టైలర్‌ పావెల్‌ తన కుటుంబంతో కలిసి స్పెయిన్‌ విహారయాత్రకు వెళ్లింది. గత మే 19న అక్కడ బార్సిలోనా సమీపంలో సంటా సుసానె వద్ద పడవలో ప్రయాణిస్తున్న సమయంలో పావెల్‌ తన ఫొటో, దానితోపాటు సందేశంతో కూడిన కాగితం ముక్కను ఓ చిన్ని సీసాలో ఉంచి.. మూత బిగించి సముద్రంలోకి విసిరేసింది. ‘మీకు ఈ ఫొటో దొరికితే.. మీ దేశం పేరు, ఈ సందేశం ఫొటోను బదులుగా పంపండి’ అంటూ పాప ఆ కాగితంలో పేర్కొంది. 

జూన్‌ ఏడవ తేదీన పావెల్‌ తండ్రి రీచీ (31) ఓ సందేశం అందింది. పావెల్‌ సముద్రంలోకి విసిరేసిన సీసా ప్రయాణిస్తూ.. ప్రయాణిస్తూ ఏకంగా రష్యా మాస్కోలోని మొస్క్వా నదీ తీరంలో దొరికిందని సాషా, అలెక్స్‌ అనే జంట తమ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు పావెల్‌ రాసిన కాగితం ముక్కను ఫొటో తీసి పంపారు. ఈ విషయమై రీచీ మీడియాతో స్పందిస్తూ.. తన సందేశం రష్యాకు చేరిందని తెలుసుకొని పావెల్‌ ఎంతో సంతోషించిందని, జలకన్యలే తన సందేశాన్ని అక్కడివరకు తీసుకెళ్లాయని తను నమ్ముతూ.. సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుందని, తనకు ఇదంతా ఒక అద్భుతంలా, మాయాలా అనిపిస్తోందని చెప్పారు. పాప విసిరేసిన బాటిల్‌ స్పెయిన్‌ చుట్టూ సముద్రంలో చక్కర్లు కొట్టి.. స్కాట్లాండ్‌ మీదుగా ఉత్తర సముద్రంలో ప్రయాణిస్తూ రష్యా చేరుకొని ఉంటుందని సముద్ర పరిశోధక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement