కర్నూలు : శ్రీశైలం బ్రహ్మోత్సవాల నిర్వహణకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం కర్నూలు జిల్లాతో పాటుౖ వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల పోలీసులను నియమించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పోలీసు అధికారుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన 2 వేల మంది పోలీసులను బందోబస్తులో పాల్గొంటారు. కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, హోంగార్డు కమాండెంట్‌తో పాటు 14 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 116 మంది ఎస్‌ఐలు, 894 మంది కానిస్టేబుళ్లు, 100 మంది మహిళా కానిస్టేబుళ్లు, 409 మంది హోంగార్డులు, 25 సెక్షన్ల ఏఆర్ ప్లటూన్లు, 4 ప్లటూన్ల ఏపీఎస్పీ బృందాలు, 12 స్పెషల్ పార్టీ బృందాలతో పాటు బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, సీసీఎస్ మఫ్టీ పోలీసు బృందాలను కూడా నియమించారు.
ఫారెస్ట్‌లోకొనసాగుతున్న కూంబింగ్...
అధిక శాతం భక్తులు కాలినడకన వెళ్తున్నందున ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు సాయుధ బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మొత్తం సాయుధ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈనెల 15 వరకు స్పెషల్ పార్టీ పోలీసులతో కూంబింగ్ నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పోలీసు శాఖ ప్రణాళిక రూపొందించింది. శ్రీశైలం ఘాట్‌లో వెళ్లే వాహనాలు ఫిట్‌నెస్(సామర్థ్యం) పత్రాలు కలిగి ఉంటేనే అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఓవర్‌లోడ్‌తో వెళ్లకుండా చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికను రూపొందించారు. కాలినడకన వెళ్లే భక్తులకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. తప్పిపోయినవారి సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్‌లో పర్యవేక్షణకు ఇద్దరు డీఎస్పీలను నియమించారు. రద్దీ ప్రాంతాల్లో నిఘా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరా, బాడీ ఓన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment