ధ్వజారోహణలో అపశృతి
శ్రీశైలం,న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీలక ఘట్టమైన ధ్వజరోహణంలో అపశృతి చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ధ్వజ పటావిష్కరణ చేసి, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేస్తున్న సమయంలో తాడు తెగి పోవడంతో ధ్వజపటం కిందపడిపోయింది. దీంతో వేదపండితులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రెండు నిమిషాల పాటు భక్తజనం శివపంచాక్షరి నామజపం నిలిపేసి అచేతనంగా ఉండిపోయారు. ఆలయ అర్చకులకు, వేదపండితులకు లఘు సంప్రోక్షణాధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం వారు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ మల్లికార్జున స్వామిని శాంతింపజేయడానికి పంచాక్షరి నామ ప్రణవనాదంతో పాటు లింగాష్టకం, బిల్వాష్టకంలను భక్తులతో పఠనం చేయించారు. సంప్రోక్షణానంతరం తిరిగి యథావిధిగా వేదమంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణ గావించారు.