తినే తిండే మనం లావెక్కేందుకు లేదా సన్నబడేందుకు కారణమని ఇన్నాళ్లూ అనుకుంటున్నామా? ఇందులో నిజం కొంతే అంటున్నారు శాస్త్రవేత్తలు. మన కడుపులో, పేవుల్లో ఉండే బ్యాక్టీరియా ఏం తింటుందో... దాన్ని బట్టి మన బరువు ఆధారపడి ఉంటుందన్నది జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన చెబుతున్న విషయం. వివరాల్లోకి వెళితే.. ఆహారంలో పీచుపదార్థం ఎక్కువ ఉంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే శరీరానికి బదులు బ్యాక్టీరియా ఈ పీచుపదార్థాన్ని తినేయడం వల్ల ఇలా జరుగుతోంది. ఆహారంలో పీచు తక్కువైనప్పుడల్లా బ్యాక్టీరియా రకాల్లో తేడాలొచ్చేస్తాయి.
ఇది కాస్తా ఊబకాయం మొదలుకొని మధుమేహం చివరకు గుండెజబ్బులకు దారితీస్తుంది. అమెరికా తదితర దేశాల ఆహారంలో చక్కెరలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయని, పీచు తక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఈ కారణంగానే అక్కడ ఊబకాయ సమస్యలు ఎక్కువ. జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అండ్రూ గెవిర్ట్‌తోపాటు యూనివర్శిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌కు చెందిన బెడిక్‌లు వేర్వేరుగా కొన్ని ఎలుకలపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. పీచు తక్కువగా ఇచ్చినప్పుడు పేవుల్లోని బ్యాక్టీరియాలో తేడాలు వచ్చాయని, మోతాదు పెంచినప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినా.. మునుపటి స్థాయికి చేరుకోలేదని వీరు అంటున్నారు. ఏతావాతా తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. బరువు తగ్గాలంటే వీలైనంత వరకూ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తినాలని!
Comments
Please login to add a commentAdd a comment