జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం పేదలకు వరం లాంటిదని సమావేశాలు జరిగిన ప్రతీసారి అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పే మాట. కానీ ఈ పథకం వాస్తవానికి అధికారులకు మాత్రమే వరంగా మారింది. పేదల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. పథకంలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చి అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ఆయుధంగా ఉన్న సామాజిక తనిఖీతో కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రతీ ఏడాది ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చుచేసి గ్రామాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను పంపడం.. వారు తనిఖీ చేసి నివేదికలు బహిరంగ పరచడం.. ఉన్నతాధికారులు డబ్బుల రికవరీకి ఆదేశాలివ్వడం.. అక్రమార్కులు వాటిని పెడచెవిన పెట్టడం.. షరా మామూలైంది. అక్రమాలు వెలికి తీయడానికి చేసే ఖర్చు కన్నా అక్రమాలు తక్కువగా చూపించడంతోపాటు ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10 విడతలుగా 171 సామాజిక తనిఖీలు, ప్రజావేదికలు నిర్వహించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిపై రెవెన్యూ రీకవరి చట్టాన్ని ఉపయోగించేందుకు అధికారులు మీనవేశాలు లెక్కిస్తున్నారు.
అందరి భాగస్వామ్యంతోనే అవినీతి..
ఈజీఎస్ పనుల్లో ఎంపీడీఓ, అడిషనల్ పీఓలు, ఏఈఈ, టీఏ, సీఓ, ఎఫ్‌ఏ, ఈసీ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వీఓలు ఇలా అన్ని స్థాయిలోని వ్యక్తులు అవినీతికి పాల్పడుతున్నట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడవుతోంది. ఈ పథకం కింద గ్రామాల్లో చెరువుల పూడికతీత, పంట కాలువల పూడికతీత, గ్రామాల్లో అంతర్గత రోడ్డు నిర్మాణాలు, మరుగు దొడ్లు నిర్మాణాలు, హరితహారంలో భా గంగా నాటిని మొక్కలకు కంచెల ఏర్పా టు మొక్కల సంరక్షణలకు నీటిని పోయ డం వంటి పనులతో పాటు మరుగు కాలువల పూడికతీత, ముళ్ల పొదల తొలగింపు వంటి పనులు కూడా చేస్తున్నారు. వీటిలోనే ఎక్కువగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయింది. కూలీల సంఖ్య ఎక్కువగా వేయడం, కూలీలు పనులకు హాజరు కాకున్న వారు హాజరైనట్లు వారి పేర వేతనాలు కాజేడం వంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనైతే పనుల చేపట్టకుండానే పూర్తి చేసినట్లు నిధులు కాజేసిన ఉదంతాలెన్నో వెలుగులోకి వచ్చాయి.
4,396 మందిపై అభియోగాలు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాక 4,396 మంది అక్రమాలకు పాల్పడారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎంపీడీఓలు 6, అడిషనల్ పీఓలు 45, ఏఈఈలు 26, టీఏలు 480, ఎఫ్‌ఏలు 1124, ఈసీలు 63, పంచాయతీ కార్యదర్శులు 1, సర్పంచులు 39, వీఓలు 2, గ్రూప్‌లీడర్లు 22, మేట్లు 1200 మిగతా వారిపై 1,259 మందిపై అభియోగాలు వచ్చాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ పథకంలో రూ.7.40 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారుల అంచనా. వీటిౖòపై నిజానిజాలు తేల్చేం దుకు సామాజిక తనిఖీ నిర్వహించారు. ఇందులో రూ.3.96 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేలింది. రూ.1.18 కోట్లు రికవరి చేసి ఈ నిధులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఖాతాల్లో జమ చేశారు. ఇలా జమ చేసిన మొత్తంలో రూ.33.01 లక్షలను కూలీలకు చెల్లించారు. ఇంకా రూ.2.78 కోట్లకు చెందిన వివరాల నిగ్గు తేల్చాల్సి ఉంది. అవినీతికి పాల్పడిన వారిపై రెవెన్యూ రికవరి చట్టం (ఆర్‌ఆర్ యాక్ట్) ద్వారా నిధులను తిరిగి వసూలు చేయాలి. కానీ కేవలం ఈ చట్టం కాగితాలకే పరిమితమై పోయింది. అవినీతికి పాల్పడిన సిబ్బందిని తాత్కాలికంగా నిధులు నుంచి తొలగించినా క్షేత్రస్థాయిలో ఇంకా చక్రం తిప్పుతున్నారు.
కేంద్రం ఆదేశించినా..
సామాజిక తనిఖీల్లోనూ అక్రమాలను వెలికితీయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర ప్రభు త్వం సైతం గుర్తించింది. వీటిని పటిష్టంగా నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారినుంచి రికవరీ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకువస్తున్నా అక్రమాలు ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల సామాజిక తనిఖీల్లో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించింది. దీంతో నైనా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న తనిఖీలో మార్పులు వస్తాయో చూడాలి.
ప్రజల సమక్షంలో తేలుస్తాం
ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసమే సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. అక్రమాలు జరిగితే ప్రజల సమక్షంలోనే సామాజిక తనిఖీ చేస్తాం. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. డబ్బులను రికవరీ చేస్తాం. – ఆనంద్‌కుమార్, డీఆర్‌డీఓ
Comments
Please login to add a commentAdd a comment