మహబూబ్‌నగర్ క్రైం: దొంగతనాలు, దోపిడీలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా 53 రకాల పాల్పడేవారికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోగతంలో గుర్తించిన నేరస్తులపై ఇప్పటివరకు నామమాత్రపు నిఘాతో సరిపెడుతుండగా.. వారు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని పలు సందర్భాల్లో వెల్లడైంది. ఇలాంటి వారిపై నిఘాను పటిష్టం చేయడానికి జిల్లావ్యాప్తంగా సకల నేరస్తుల సర్వే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చూట్టారు. సర్వేను ఎస్పీ బి.అనురాధ జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా కొంద రు నేరస్తుల వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఏను గొండ, పాత పాలమూరు, వన్‌టౌన్ సమీపంలో పలువురి వివరాలు సేకరణలో ఎస్పీ పాల్గొన్నారు.
199 బృందాలు
పోలీసు అధికారులు, సిబ్బందిని సర్వే కోసం 199 బృందాలుగా ఏర్పాటుచేశారు. మహబూబ్‌నగర్ డివిజన్‌లో 135 బృందాలు, నారాయణపేట డివిజన్‌లో 64 బృందాలను ఏర్పాటుచేయగా, ఆరుగురు అధికారులు నేతృత్వం వహించారు. మొత్తం 205 మంది అధికారులు, సిబ్బంది పాల్గొని గురువారం 2,486 మంది నేరస్తుల వివరాలు సేకరించారు. సర్వే మరో వారం కొనసాగుతుందని.. ఆలోగా మొత్తం 5,495 మంది పాత నేరస్తుల వివరాలు సేకరిస్తామని ఎస్పీ అనురాధ జడ్చర్లలో మాట్లాడుతూ వెల్లడించారు.
ముమ్మరంగా సర్వే
పాత నేరస్తుల గుర్తింపులో భాగంగా సాగిన సకల నేరస్తుల సర్వే జిల్లా కేంద్రంలో ముమ్మరంగా సాగింది. ఏఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు స్థానిక వేపూరి గేరిలో నివాసముంటున్న పాత నేరస్తుల వివరాలు స్వయం గా సేకరించారు. అలాగే, టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ భాస్కర్, సీఐ డీవీపీ.రాజు ఆధ్వర్యాన సంజయ్‌నగర్, న్యూగంజ్, ప్రేమ్‌నగర్, మోనప్పగుట్ట, షాషాబ్‌గుట్ట తదితర ప్రాంతాల్లో 172 మంది వివరాలు సేకరించారు. అదేవిధంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐలు రామకృష్ణ, సీతయ్య ఆధ్వర్యాన పాతపాలమూరు, వేపూరిగేరి, వీరన్నపేట తదితర కాలనీల్లో 286 మంది, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ పార్థసారథి ఆధ్వర్యాన తిమ్మసానిపల్లి, కోయనగర్, ఏనుగొండ, అప్పన్నపల్లి, ఎదిర, బండమీదిపల్లి, శ్రీనివాసకాలనీ, భగిరథకాలనీ, బీకెరెడ్డి కాలనీ, మండల పరిధిలో 19 గ్రామాల్లో 246 మంది పాత నేరస్తులల వివరాలను సేకరించారు. ఇంకా జిల్లాలోని జడ్చర్లలో 400 మంది, మక్తల్‌లో 141 మంది, భూత్పూర్‌లో 147 మంది వివరాలను తొలి రోజు సేకరించారు.
ప్రత్యేక దృష్టి
పాత నేరస్తులు, అసాంఘిక శక్తులపై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పదేళ్ల నుంచి ఎలాంటి నేరాలకు పాల్పడి పోలీస్ హిస్టరీ షీట్‌లో ఉన్నవారిని కలిసి నేరచరిత్రతో పాటు వ్యక్తి గత సమగ్ర వివరాలు సేకరించారు. తాజా ఫొటోల తో పాటు వారిపై నమోదైన నేరాలు, శిక్షలు, ప్రస్తుత జీవన విధానం, ప్రవర్తన కుటుంబ వివరాలు సేకరించి ఈ–అప్లికేషన్ వైబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
వ్యక్తిగత ఇబ్బంది ఉండదు
గతంలో నేరాలు చేసి ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తులకు ఈ సర్వే వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలంలో పాత వారిలో ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడకుండా సమాచారం తీసుకుంటున్నాం. వారం రోజుల్లో జిల్లాలో సర్వే పూర్తి చేసి అందరి ఇళ్లకు జియోట్యాగింగ్ చేసి ఈ–అప్లికేషన్‌లో వివరాలు పొందుపరుస్తాం. తద్వారా బ్లూకోర్ట్స్, రాత్రి పూట గస్తీలు చేసే, పెట్రోలింగ్ చేసే సిబ్బందికి ఎక్కడైనా నేరం జరిగినట్లు తెలియగానే ఆ నేర స్వభావాన్ని బట్టి అలాంటి నేరాలు గతంలో చేసిన పాత నేరస్తులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం సులువవుతుంది. – బి.అనురాధ, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment