తండాలో గుడిసెలో ఉంటున్న కిషన్ నాయక్
కొత్తకోట : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, తండాల అభివృద్ధికి కోట్లాదిరూపాయలు వెచ్చిస్తుంది. కానీ మారుమూల ప్రాంతాల్లోని అనుబంధ గ్రామాలు పాలకుల నిర్లక్ష్యం.. అధికారులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడంలేదు.
ఇదీ పరిస్థితి
మండలంలోని కానాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కానాయపల్లి తండా ఉంది. తండా మండల కేంద్రానికి సు మారు 6 కి.మీ. దూరంలో ఉంది. తం డాలో 62 కుటుంబాలు, 350 మంది జనాభా ఉన్నారు. కానాయపల్లి గ్రామం శంకరసముద్రం రిజర్వాయర్‌లో భాగం గా ముంపునకు గురైంది. గ్రామస్తులకు ప్రభుత్వం మరో చోట పునరావాసం కల్పించనుంది. కానీ గ్రామానికి అతి దగ్గరంలో ఉన్న కానాయపల్లి తండాకు సంబంధించి 110 ఎకరాలు ముంపులో పోగా, కేవలం 20 ఎకరాలు మాత్రమే మిగిలింది. శంకర సముద్రం రిజర్వాయర్‌లోకి పూర్తి స్థాయిలో నీరు వస్తే 300 మీటర్ల దూరంలోనే ఉంటుందని తండావాసులు చెబుతున్నారు.
సమస్యలివి..
తండాలో వీధిలైట్లు లేవు. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉంది. తండావాసులకు ప్రత్యేకమైన రోడ్డు సౌకర్యం లేదు. బండ్ల బాటే.. రోడ్డు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని తండావాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని వారు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీగా గుర్తించాలి
కానాయపల్లి తండా, మనిగిల్ల తండా, బుగ్గపల్లితండాలను కలిపి గ్రామ పంచాయితీలుగా గుర్తించాలి. అనుబంధ గ్రామం కావడం మూలంగా తండాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలి.
– అంజినాయక్, కానాయపల్లితండా
ముంపు గ్రామంగా గుర్తించాలి
కానాయపల్లి తండాను ముంపు గ్రామంగా గుర్తించాలి. రేషన్ దుకాణం లేకపోవడం వల్ల కానాయపల్లికి 3 కి.మీ. దూరం కాలినడక వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే చాలా సమస్యలు తీరుతాయి.
– రుక్కమ్మ, కానాయపల్లి తండా
Comments
Please login to add a commentAdd a comment