న్యూఢిల్లీ/జెనీవా: ప్రపంచ తయారీ రంగ సూచీలో భారత్ 30 స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య(డబ్ల్యూ ఈఎఫ్) ఈ రాం్యకుల జాబితాను ప్రకటించింది. కాగా, జపాన్ ఈ సూచీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా తొలి ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. ఇక టాప్–10లో ఆతర్వాత స్థానాల్లో చెక్ రిపబ్లిక్, అమెరికా, స్వీడన్, ఆస్ట్రియా, ఐర్లండ్ నిలిచాయి. చైనా కంటే తయారీ రంగంలో భారత్ చాలా వెనుకబడినప్పటికీ... ఇతర బ్రిక్స్ దేశాలతో(బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా) పోలిస్తే మెరుగ్గానే ఉండటం గమనార్హం. ర్యాంకింగ్స్‌లో రష్యా 35, బ్రెజిల్ 41, దక్షిణాఫ్రికా 45 స్థానాల్లో ఉన్నాయి.
‘భవిష్యత్తు తయారీ సంసిద్ధత’ పేరుతో తొలిసారిగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూ ఈఎఫ్ ఈ వివరాలను పొందుపరిచింది. అధునాతన పారిశ్రామిక వ్యూహాల రూపకల్పన విషయంలో దేశాలు అనుసరిస్తున్న విధానాలను విశ్లేషించి 100 దేశాలను నాలుగు గ్రూపులుగా విభజించింది. ఇందులో భారత్ మూడో గ్రూప్(లెగసీ–బలమైన మూలాలు ఉన్నా, భవిష్యత్తులో రిస్కులు అధికం)లో ఉంది. కాగా, ఇదే గ్రూప్‌లో హంగరీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, రష్యా, థాయ్‌లాండ్, టర్కీ వంటివి ఉన్నాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు మాత్రం నాలుగో గ్రూప్(ప్రారంభ స్థాయి)కే పరిమితం కావడం విశేషం.
ఈ నెలాఖరులో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూ ఈఎఫ్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ నివేదికను విడుదల చేసింది. తయారీ రంగంలో ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. 2016లో ఈ రంగానికి సంబంధించి 420 బిలియన్ డాలర్ల విలువను జోడించిందని తెలిపింది. గడిచిన మూడు దశాబ్దాలుగా సగటున భారత్ తయారీ రంగం 7 శాతం వృద్ధిని సాధించిందని.. జీడీపీలో 16–20 శాతం వాటా ఈ రంగానిదేనని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment