
సంగారెడ్డి క్రైం: దేశవ్యాప్తంగా ఈ నెల 17న నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ అన్నారు. సంగారెడ్డిలోని సుందరయ్యభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 28 రకాల ప్రభుత్వ పథకాలను ప్రవేశ పెట్టారని, అందులో లక్షలాది స్కీం వర్కర్లు పని చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వీరిని కార్మికులుగా గుర్తించలేదని ఆరోపించారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అందించేది స్కీం వర్కర్లు అన్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు. చాలిచాలనీ వేతనాలతో కుటంబాలను వెళ్లదీస్తున్నారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇప్పటికి రెండుసార్లు వేతనాలను పెంచారని, కష్టించే స్కీం వర్కర్లకు మాత్రం పెంచడం లేదని విమర్శించారు. కనీస వేతనం రూ.18 వేలు ఇచ్చి, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న సంగారెడ్డిలోని ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి యాదవరెడ్డి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment