‘‘సిన్మాలో చాలా ఎగ్జయిటింగ్ అంశాలున్నాయి. హైలైట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని దాచిపెట్టాం!’’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘స్పైడర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. రేపు రిలీజవుతున్న ఈ సిన్మా గురించి మహేశ్ చెప్పిన ముచ్చట్లు...
► సిన్మాలో ఇంటిలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఆఫీసర్‌గా నటించా. టీజర్‌లో చూపించిన ‘స్పైడర్’ సిన్మాలో ఉండదు. హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేయడం కోసం కాన్సెప్ట్ బేస్డ్‌గా టీజర్‌ను షూట్ చేశాం. ∙
► ‘స్పైడర్’ తెలుగు, తమిళ్ వెర్షన్స్ వేర్వేరుగా ఉంటాయి. తెలుగుకి, తమిళ్‌కి కొందరు నటీనటులు మారతారు. అలాగే రెండు భాషలకు సంబంధించిన సీన్స్‌ని వెంట వెంటనే షూట్ చేయడంతో తెలుగు, తమిళ్ డైలాగ్స్ మాట్లాడేవాణ్ణి. అదో కొత్త ఎక్స్‌పీరియన్స్! అందుకే.. కొరటాల శివగారితో ప్రస్తుతం చేస్తున్న ‘భరత్ అనే నేను’ చాలా ఈజీగా ఉంది. జస్ట్ తెలుగులో డైలాగులు చెబితే చాలు.. సీన్ కంప్లీట్ అయిపోతోంది. ఇంతేనా అనిపిస్తోంది.
‘స్పైడర్’ అనేది హీరో–విలన్ కథ. సిన్మాకు విలన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మురుగదాస్‌గారు కథ చెప్పిన రెండు నెలల తర్వాత ‘మన సినిమాలో ఎస్.జె. సూర్య విలన్’ అన్నారు. ఫస్ట్... నాకేం అర్థం కాలేదు. దర్శకుడిగా అతను నాకు బాగా తెలుసు. రెండు రోజులు ఆలోచించాక అతనే విలన్‌గా పర్‌ఫెక్ట్ అనుకున్నా. ఎస్.జె. సూర్య నటించిన తమిళ సినిమాలు చూశా. బ్రిలియంట్ యాక్టర్! మురుగదాస్‌గారిపై గౌరవంతో తమిళ నటుడు భరత్ ఇంపార్టెంట్ రోల్ చేశారు.
► ‘స్పైడర్’లో డ్యూయల్ రోల్ చేశారట? అనడిగితే... అదే నిజమైతే ప్రోమో లో వేసేవాళ్లమన్నారు. మీరు, నమ్రతగారు ఈ సిన్మా చూశారా? అనడిగితే... ‘‘నమ్రత చూడలేదు. నేనిప్పటివరకూ 150సార్లు చూశా’’ అని మహేశ్ చమత్కరించారు.