దెయ్యం లేని హర్రర్ చిత్రం ఉరు
సాధారణంగా హర్రర్ కథా చిత్రాలంటే దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉంటాయి. అయితే అవేవీ లేకుండానే హర్రర్ కథాంశంతో భయపెట్టడానికి రెడీ అయ్యింది ‘ఉరు’ చిత్రం. వినడానికే ఆసక్తిగా ఉంది కదూ వైఎం మీడియా పతాకంపై వీపీ. విజీ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను విక్కీఆనంద్ నిర్వహించారు. కలైయరసన్, సాయి ధన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన ఇందులో మైమ్‌గోపీ, డేనియల్ ఆణి, తమిళ్‌సెల్వి, కార్తీక ముఖ్య పాత్రలు పోషించారు. మెట్రో చిత్రం ఫేమ్ జోహన్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌తో ఈ నెల 16న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలను తెలుపుతూ ‘ఉరు’ అంటే భయం అనే అర్థం ఉందన్నారు.
ఈ చిత్రం భయం ఇతివృత్తంగా రూపొందడంతో ఉరు అనే టైటిల్‌ను పెట్టినట్లు చెప్పారు. ఇది సైకో థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. హర్రర్ కథా చిత్రం అయినా ఇందులో దెయ్యాలు ఉండవన్నారు. కోడైకెనాల్, మేఘమలై ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఎక్కువగా షూటింగ్ చేసినట్లు చెప్పారు. ఇందులో హీరో కలైయరసన్ రచయిత అని తెలిపారు. మంచి కుటుంబ ఇతివృత్తాలతో నవలను రాసే ఆయనకు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తరహా నవలకు ఆదరణ తగ్గుతుందన్నారు. దీంతో హర్రర్ నవల రాసేందుకు మేఘమలై వెళతాడన్నారు. అక్కడ నవల రాయడం మొదలెట్టిన కళైయరసన్‌కు కొన్ని సంఘటనులు ఎదురవుతాయన్నారు. అవేమిటీ? వాటి కారణంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు.