
ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్ నిర్మాతలు
బాలీవుడ్ నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ముంబై: బాలీవుడ్ నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు సుమారు రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు అనే వార్తలొచ్చిన నేపథ్యంలో ప్రొడ్యూసర్ల గుండెలు గుభేలు మన్నాయి. ఈ కేసులో జోధ్ పూర్ కోర్టు తుది తీర్పును బుధవారం వెల్లడిస్తుందని ముందు అనుకున్నప్పటికీ, మార్చి 3 కు తీర్పును వాయిదా వేయడంతో వారికి కొంత ఊరట లభించింది.
బాలీవుడ్ లోని పలువురు నిర్మాతలు హీరో సల్మాన్ పై సుమారు 200 కోట్లపైగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. 'బాడీగార్డ్' జైలుకెడితే తమ సినిమాల పరిస్థితి ఏంటని వారు ఆందోళన పడ్డట్టు సమాచారం. తీర్పును వాయిదా వేయడంలో వారంతా ఊరట చెందారట. అయితే ఒక వేళ తీర్పు వెలువడినప్పటికీ, మళ్ళీ అప్పీలుకు వెళ్ళే అవకాశం ఉండటం నిర్మాతలకు మరింత రిలీఫ్ నిచ్చే అంశం.
ఈ నలభైతొమ్మిదేళ్ల కండల వీరుడు ప్రస్తుతం అరడజనుకు పైగా ప్రాజెక్టులపై సైన్ చేశాడట. ప్రస్తుతం సూరజ్ భర్జాత్య డైరక్షన్ లో వస్తున్న ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగులో బిజీ బిజీగా ఉంటే, కబీర్ ఖాన్ దర్శకత్వంలోని భజరంగి భాయ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఒక్క ఈ రెండు సినిమాలపైనే 150 కోట్లకు పెట్టుబడి పెట్టినట్టు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ కమల్ నహ్తా అంచనా వేస్తున్నారు. మరో 50 కోట్లకు పైగా విలువ చేసే ఇతర ప్రాజెక్టులపై సైన్ చేశారట ఈ దబాంగ్ హీరో.