ముంబై: నటులుగా, రాజకీయ నాయకులుగా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న సునీల్ దత్, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హాల జీవితాలే తనకు ఆదర్శమని బీజేపీ నుంచి కొత్తగా లోక్ సభకు ఎన్నికైన మనోజ్ తివారీ స్పష్టం చేశారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించిన ఆ ముగ్గరు జీవితాల్నిసవాల్ తీసుకుని తాను కూడా ముందుకు వెళతానని తివారీ తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. వారి జీవితాలే తనకు ఆదర్శమన్నారు.
ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు రాజకీయ రంగాల్లో రాణించలేరని అపవాదును వారు ముగ్గురు తొలగించారన్నారు. ఆ విమర్శలు సరైనవి కావనడానికి వారి రాజకీయ జీవితాన్ని పరికిస్తే అవగతమవుతుందన్నారు. 'నేను భోజ్ పూరి భాషా సంక్షేమానికి, హిందీ చిత్ర రంగ అభివృద్ధికి కృషి చేస్తానని' తివారీ తెలిపాడు. లోక్ సభలో ఈ అంశాలకు సంబంధించి తనగొంతును వినిపించడానికి సిద్ధంగా ఉన్నానని తివారీ తెలిపారు.