తమిళసినిమా: నటి రితికాసింగ్ రూటు మార్చేసింది. ఈ బ్యూటీ రియల్ లైఫ్‌లో బాక్సర్. అయితే ఆ క్రీడారంగంలో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే తెలిసిన రితికాసింగ్‌ను మరింత మందికి పరిచయం చేసింది ఇరుదుచుట్రు చిత్రం. చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే బాక్సర్ కంటే ముందే యాక్టర్స్ అయ్యింది. అవును ఈ ముంబయి భామ 2002లోనే బాలనటిగా టార్జాన్ భేటీ అనే చిత్రంతో నటించింది. కథానాయకిగా సుధా కొంగర దర్శకత్వం వహించిన ఇరుదుచుట్రు చిత్రంతో కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అదే చిత్రంతో బాలీవుడ్‌కు, ఆ తరువాత రీమేక్ చిత్రం గురుతో తెలుగుకు ఎంట్రీ ఇచ్చేసింది.
ఆ చిత్రంలో చాలా సహజంగా చక్కని నటనను ప్రదర్శించిన ఈ బ్యూటీపై దక్షిణాది దృష్టి పడింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆండవన్ కట్టళై, శివలింగ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. ఆ రెండూ సక్సెస్ అయ్యాయి. వాటితోనూ కుటుంబ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు పొందింది. అయితే అదే రితికాసింగ్‌కు మైనస్ అయ్యిందేమో. అవకాశాలు కొరవడ్డాయి. దీంతో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్‌కు మారక తప్పలేదు. మడి కట్టుకుని కూర్చుంటే ఎవరూ పట్టించుకోరనుకుందో ఏమో. ఇటీవల అందాలను ఆరబోసే విధంగా ఫొటోసెషన్ చేయించుకున్న రితిక వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ ప్రయత్నం ఫలించినట్లుంది.
ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక అవకాశం తలుపు తట్టింది. నటుడు అరుణ్‌విజయ్‌కు జంటగా నటించనుంది. పాత్ర నచ్చితే హీరో, విలన్ అని చూడకుండా నటించడానికి రెడీ అంటున్న అరుణ్‌విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తడం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా అగ్నిసిరగుగళ్ చిత్రంలోనూ,తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రంలో ముఖ్య పాత్రలోనూ నటిస్తున్న అరుణ్ విజయ్ తాజాగా బాక్సర్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో రితికాసింగ్ ఆయనకు జంటగా నటించే అవకాశం దక్కించుకుంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ ఇతి వృత్తంతో తెర కెక్కుతోందట. ఈ చిత్రంతోనైనా రితిక హీరోయిన్‌గా బిజీ అవుతుందేమో చూడాలి. ఈ అమ్మడు నటించిన వడంగాముడి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment