నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు
చాలా టార్చర్ చేస్తున్నారంటూ నటి భావన తెగ బాధపడిపోతోంది. కోడంబాక్కం చిత్రం ద్వారా రౌడీ పిల్లగా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ కుట్టి భావన ఆ తరువాత వాళి తదితర చిత్రాల్లో నటించినా అమ్మడికిక్కడ తగినంత ఆదరణ లభించలేదు. దీంతో టాలీవుడ్‌లో పాగా వేసింది. అక్కడ కొన్ని అవకాశాలొచ్చాయి. అయితే తెలుగులో కూడా భావన నిలదొక్కుకోలేకపోయింది. మళ్లీ సొంత గూటికే చేరాల్సి వచ్చింది.
ప్రస్తుతం మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న భావనకు పెళ్లి అంటూ ప్రచారం జోరందుకుంది. జనవరిలో భావన ఇంట బాజాభజంత్రీలు మోగనున్నాయంటున్నారు. ఇలాంటి వార్తలపై భావన స్పందిస్తూ తనకు పెళ్లంటూ ఇలా నెలకోసారి వదంతులు ప్రచారం చేస్తున్నారని వాపోయింది. ఇలాంటి పుకార్లకు బదులిచ్చి అలసిపోయానని అంది. తమిళ చిత్రాల్లో నటించి చాలా కాలమే అయ్యిందని ప్రస్తుతం మలయాళం, కన్నడం చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో వివాహానికి తొందరపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది.
నిజానికి వచ్చే ఏడాది జనవరిలో తన అన్నయ్య జయదేవ్ వివాహం జరగనుందని చెప్పింది. ఇది సరిగ్గా తెలుసుకోకుండా తన పెళ్లంటూ వదంతులు పుట్టిస్తున్నారంది. దీంతో పలువురు దర్శక, నిర్మాతలు ఫోన్ చేస్తూ మీకు పెళ్లంటగా అంటూ ఒకటే టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి పెళ్లి అనేది పవిత్రమైనది. ఆ గడియలు వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ తెలియజేస్తానని అంది. అదే విధంగా రహస్య వివాహం చేసుకోవలసిన అవసరం తనకు లేదని ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనేనని భావన స్పష్టం చేసింది.