
ఆయన మాటే నా మాట
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాటే నా మాట అంటున్నారు నటి రాధిక. ఏమిటీ రాధిక వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయా? అయితే రండి ఆ సంగతేమిటో చూద్దాం.నటిగా రాధిక సత్తా ఏమిటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథానాయకిగా పలు భాషల్లో వీరవిహారం చేసిన ఈమె ఇప్పుడు వెండితెర, బుల్లితెర అంటూ ప్రధాన భూమికల్లో నటిస్తున్నారు. రాధిక భర్త, నటుడు శరత్‌కుమార్ సమత్తువ మక్కళ్ కచ్చికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక చిత్ర షూటింగ్ కోసం పళని వెళ్లిన రాధిక అక్కడ కొలువైన సుబ్రమణ్యసామిని దర్శించుకున్నారు.
ఆమె విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ పళని సమీపంలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొనడానికి వచ్చి ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వచ్చినట్లు తెలిపారు.తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తానన్నది తనకే తెలియదని అన్నారు. ఈ ప్రశ్నకు రజనీకాంత్ చెప్పే సమాధానమే తనదీ అని అన్నారు. తాను ఎలా వస్తాను, ఎప్పుడు వస్తాను అన్నది కాలమే నిర్ఱయిస్తుందన్నారు.ఇక సమత్తువ మక్కళ్ పార్టీ శాసనసభ ఎన్నికల కూటమి నిర్ణయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌నే తీసుకుంటారని ఆ వ్యవహారంలో తాను తలదూర్చనని రాధిక పేర్కొన్నారు.