
రీ ఎంట్రీ కలిసొస్తుందా?
హీరోయిన్లకు వివాహానంతరం అవకాశాలు రావడమే గగనంగా మారింది. అలాంటిది ఒక వేళ వచ్చినా అవి ఏ అక్కో, అమ్మో
హీరోయిన్లకు వివాహానంతరం అవకాశాలు రావడమే గగనంగా మారింది. అలాంటిది ఒక వేళ వచ్చినా అవి ఏ అక్కో, అమ్మో పాత్రలుగా ఉంటాయి. దక్షిణాదిలో పెళ్లి అయిన తరువాత నటీమణులు కథానాయకిలుగా రాణించడం అన్నది అరుదే. ఇటీవల భర్త నుంచి విడాకులకు సిద్ధమైన అమలాపాల్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు ఎండమావిగా మారుతున్నాయని చెప్పవచ్చు. అంతకు ముందు అవకాశాలిస్తామన్న వారు కూడా ఇప్పుడు ముఖ చాటేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటి స్నేహ నాయకిగా రీఎంట్రీ అవుతున్నారు.
ఈ భామ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు పండంటి బిడ్డ కూడా ఉన్నారు. వివాహనంతరం ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన స్నేహ ఆ తరువాత హీరోయిన్ పాత్రలు అయితేనే చేస్తానని తేల్చి చెప్పారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ లలో అలాంటి అవకాశాలివ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు రాకపోయినా మాలీవుడ్ మాత్రం స్నేహ నటనా ప్రతిభను వాడుకోవడానికి ముందుకొచ్చింది. గ్రేట్ ఫాదర్ అనే మలయాళ చిత్రంలో మమ్ముట్టికి జంటగా నటించడానికి స్నేహ సిద్ధం అవుతున్నారు.
తను ఇంతకు ముందు మమ్ముట్టితో రెండు చిత్రాలు చేశారన్నది గమనార్హం. అయితే వివాహానంతం నాయకిగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇందులో మమ్ముట్టికి విలన్‌గా నటుడు ఆర్య నటించనుండడం విశేషం. మలయాళం మాతృభాష అయిన ఆర్య ఇంతకు ముందు అక్కడ కొన్ని చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. ఈ గ్రేట్ ఫాదర్ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటించనున్నారట.
త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంతో తన రీఎంట్రీ ముడిపడి ఉందని అంటున్నారట నటి స్నేహ. ఇది విజయం సాధిస్తేనే తదుపరి నటించే విషయం గురించి నిర్ణయం తీసుకుంటానని స్నేహ అంటున్నట్లు సమాచారం. అయితే ఈ రీఎంట్రీ తనకు మళ్లీ స్టార్‌డమ్‌ను తీసుకొస్తుందనే నమ్మకంలో ఉన్నారట. చూద్దాం స్నేహ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తారో.