
శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న నటి శ్రీరెడ్డి తాజాగా ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. టాలీవుడ్‌లోని కాస్టింగ్ కౌచ్ సంస్కృతి, సినీ అవకాశాల పేరిట వర్థమాన నటీమణులు, అమ్మాయిలను వాడుకుంటున్న తీరును బయటపెట్టి.. టాలీవుడ్‌లో దుమారం రేపిన శ్రీరెడ్డి తాజాగా ఓ స్టార్ హీరోను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. సినీ తెరమీదే కాదు నిజజీవితంలోనూ ఆయన ‘నాచురల్’గా నటిస్తాడని, ఆయన ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని శ్రీరెడ్డి ఆరోపించారు. స్టార్‌హీరోలు రాంచరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ నుంచి అతను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, వారికి అహంభావం లేదని, కానీ అతనికి యాటిట్యూడ్ చాలా ఉందని పేర్కొన్నారు. అతనికి ఈ మధ్యే కొడుకు పుట్టాడని అభినందనలు చెప్తూనే.. చేసిన తప్పులకు అతను కచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడని, సినీ పరిశ్రమ అతన్ని శిక్షిస్తుందదని, ఇండస్ట్రీ నుంచి ఇలాంటివన్నీ ఈకలా రాలిపోవాలంటూ పోస్టు చేశారు. తాజా పోస్టులో నర్మగర్భంగా ఆమె ఎవరినీ టార్గెట్ చేసిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఆమె ఫేస్‌బుక్‌లో ఏమన్నారంటే..
‘నిజజీవితంలోనూ నువ్వు చాలా బాగా నటిస్తావు. తెరమీద చాలా నాచురల్‌గా నటిస్తావు. నువ్వు నాచురల్‌గా కనిపిస్తావు కానీ, అది నీ ముసుగు మాత్రమే. జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నానని ఎప్పుడు చెప్పే నువ్వు.. ప్రజలను ఎమోషనల్ అత్యాచారానికి గురిచేస్తావు. నీ కంటే పెద్ద హీరోలు ఎంతో బెటర్. తాతలు, తండ్రుల మద్దతు ఉన్నప్పటికీ వాళ్లు ఎంతో హుందాగా, క్రమశిక్షణగా ఉంటారు. చరణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వారికి అహంభావం ఎంతమాత్రం లేదు. కానీ నీకు చాలా యాటిట్యూడ్ ఉంది.
చిన్న దర్శకులను నువ్వు గౌరవించవు. సక్సెస్ అయిన తర్వాత నీకు యాటిట్యూడ్ పెరిగిపోయింది. ఇటీవల నీకు కొడుకు పుట్టాడు. అభినందనలు. కానీ, జీవితంలో జాగ్రత్తగా ఉండు. ఎంతోమంది అమ్మాయిలతో నువ్వు ఆడుకున్నావు. వాళ్లు ఇప్పటికీ ఏడుస్తున్నారు. కానీ న్యాయం వైపే దేవుడుంటాడు. శిక్ష పడటానికి కొంత పట్టొచ్చు అంతే. నువ్వు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతావు. సినీ పరిశ్రమ నిన్ను శిక్షిస్తుంది. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివన్నీ ఈకలా రాలిపోవాలి’ అంటూ శ్రీరెడ్డి పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.