
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి.. ఆమె ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెపై పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమెను దూషిస్తూ.. కించపరుస్తూ.. అవమానిస్తూ.. బెదరిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. పలువురు పవన్ అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బిగ్‌బాస్ షో విజేత, నటుడు శివబాలాజీ కూడా శ్రీరెడ్డికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్‌ను దూషించినందుకు శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.
ఈ పరిణామాలు ఇలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి పవన్ అభిమానులను హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. తన ఫేస్‌బుక్ పేజీ పోలీసుల నిఘాలో ఉందని, బెదిరించేవాళ్లు, ట్రోలింగ్ చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఆమె పోస్టు చేశారు. ‘నా ఫేస్‌బుక్ పేజీ పోలీసుల నిఘాలో ఉంది. కాబట్టి జాగ్రత్త. వ్యక్తులను బ్లాక్ చేయడాన్ని నేను ఆపేశాను. పవన్ అభిమానులు ఎంతగా బెదిరిస్తున్నారో.. ట్రోల్ చేస్తున్నారో అందరికీ చూపించాలని మేం అనుకుంటున్నాం. ఎన్‌హెచ్‌ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) మాకు మద్దతుగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ మీడియా గమనిస్తోంది. కమాన్.. బ్యాడ్ కామెంట్స్ చేయండి’ అంటూ ఆమె పేర్కొన్నారు. టాలీవుడ్ పెద్దలు తెలివైన గేమ్స్ ఆడుతూ.. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మరో పోస్టులో ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment