
అల్లు అర్జున్
వైకుంఠపురములో ఏం జరుగుతుంది? ‘ఇలా జరుగుతుంది’ అని ఎవరి ఊహలకు తగ్గట్టు వాళ్లు ఊహించుకోవచ్చు. మరి.. ఇక్కడి వైకుంఠపురములో ఏం జరుగుతోందంటే నవ్వులు, లవ్వులు, ఫైట్లు, పండగలు.. ఇలా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మాత్రం ఫైట్ జరుగుతోంది. ఇక్కడి వైకుంఠపురానికి హీరో అల్లు అర్జున్. దర్శకుడు త్రివిక్రమ్. ఈ కాంబినేషన్‌లో ‘అల... వైకుంఠపురములో..’ పేరుతో అల్లు అరవింద్, చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఫైట్‌మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ సారథ్యంలో ఈ ఫైట్ సీన్స్ తెరకెక్కుతున్నాయి. ఈ ఫైట్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుందట. నెక్ట్స్ ఓ ఫారిన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్, టబు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా పండగకి ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment