సాక్షి, హైదరాబాద్: ‘రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. 'అల.. వైకుంఠపురములో' మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన థాంక్స్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది.. బన్నివాసు, వక్కంతం వంశీకి. ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చింది, త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్లిద్దరు. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. 'సిత్తరాల సిరపడు' సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్’ అని చెప్పారు. నటులు సుశాంత్, హర్షవర్ధన్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో 'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. (అది మొదట చెప్పింది మెగాస్టారే: బన్నీ)
Comments
Please login to add a commentAdd a comment