
బన్నీతో మూడో విజయం ఖాయం : ‘దిల్’ రాజు
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి కెమేరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ - ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 25వ చిత్రమిది.
‘గబ్బర్ సింగ్’ తర్వాత రాజుగారి నిర్మాణ సంస్థలో ఎంటరయ్యాను. నేను బయటకు వెళ్లడం లేదు, ఆయన వెళ్లనివ్వడం లేదు. ఈ సంస్థలో మూడు కాదు, ముప్ఫై చిత్రాలు చేయడానికి నేను రెడీ. ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నప్పుడు రాజమండ్రిలో ‘ఆర్య’ చూశాను. అప్పట్నుంచీ బన్నీతో ఓ చిత్రం చేయాలనే నా కోరిక ఇన్నాళ్లకు నేరవేరింది. ప్రతి చిత్రానికి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, విజయాలతో పాటు కష్టాన్ని పెంచుకుంటున్న బన్నీతో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘అల్లు అర్జున్ మా సంస్థలో నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఎగ్జైటింగ్‌గా ఉంది. ‘ఆర్య’, ‘పరుగు’ తరహాలో ఈ ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ సక్సెస్ సాధిస్తుంది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: గౌతమ్‌రాజు, కళ: రవీందర్, స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్, కెమేరా: అయాంకా బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.