
బట్... అంతా మెగా ఫ్యామిలీనే!
– అల్లు అర్జున్
‘‘తండ్రిగా బన్నీ (అల్లు అర్జున్) ప్రతి సినిమా హిట్టవ్వాలని కోరుకుంటా. కానీ, ఈ డీజే ‘దిల్’ రాజు కోసం హిట్టవ్వాలని కోరుకుంటున్నా. చిత్రపరిశ్రమలో నాకున్న మంచి స్నేహితుల్లో ఆయనొకరు. వ్యక్తిగతంగా ఆయనకు ఓ నష్టం (‘దిల్’ రాజు భార్య అనిత మృతి గురించి) జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి ఏదీ చేయలేం. కానీ, మా ఫ్యామిలీ నుంచి ఆయనకు ఓ సూపర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా’’ అన్నారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన సినిమా ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
అల్లు అరవింద్ మనవడు అయాన్ (బన్నీ కుమారుడు), ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ పాటల సీడీలను విడుదల చేశారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ఓ రోజు మా ఇంట్లో పదిమంది బ్రాహ్మణులను చూశా. పూజలు ఏమైనా చేస్తున్నారా? అని మా ఆవిడను అడిగితే... బన్నీ కోసం వచ్చారని చెప్పింది. ‘డీజే’ కోసం బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలు, వేదం ఎలా పలకాలనేది నేర్చుకుంటున్నాడని చెప్పింది. అప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. దేవిశ్రీ సూపర్ సాంగ్స్ ఇచ్చాడు’’ అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే... నా ఫ్యాన్స్, నా సినిమాలు చూసే ఇతర హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకులే కారణం. నేను మరచిపోకుండా చెప్పాల్సింది మెగా ఫ్యాన్స్ గురించి. మెగా ఫ్యాన్స్ అంటే... మెగాస్టార్ చిరంజీవిగారి ఫ్యాన్స్ అని కాదు. పవన్‌గారు, రామ్‌చరణ్, వరుణ్, తేజు, శిరీష్, నిహారిక, నేను... ఎవ్వరుంటే వారు. మీరు (ప్రేక్షకులు) ఎవరినైనా ఇష్టపడొచ్చు. బట్... అంతా మెగా ఫ్యామిలీనే. ఎప్పుడూ నా సినిమాలు నా కోసం హిట్ అవ్వాలనుకుంటా. అనిత ఆంటీ మమ్మల్ని విడిచి వెళ్లినా... మాకు ఏ లోటు లేకుండా సినిమా పూర్తిచేసిన ‘దిల్’ రాజుగారి కోసం ఈ సినిమా హిట్టవ్వాలనుకుంటున్నా.
హరీష్ సినిమాల్లో వినోదం ఉంటుంది. కానీ, ‘డీజే’లో వినోదం, భావోద్వేగం రెండూ కుదిరాయి’’ అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌లోని ‘మనం చేసే పనిలో మంచి కనపడాలి తప్ప... మనిషి కాదు’ అనే మాటలను పవన్‌కల్యాణ్‌గారి స్ఫూర్తితో రాశా. ‘గబ్బర్ సింగ్’ సక్సెస్ తర్వాత పవన్‌గారిని కలసి, ఓ ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే... ‘సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కనపడాలి’ అన్నారు. అంతే కాదు... ‘సక్సెస్ మనిషిని ఉన్న చోట ఉండనివ్వదు. చెడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పారు. ఈ కట్టె కాలే వరకూ నేను పవన్ ఫ్యానే. ఆయనతో సినిమా అంటే... ప్రకృతి సహకరించాలి. పవన్ నుంచి ఆదేశాలు రావాలి.
ఇక, ఈ సినిమా విషయానికి వస్తే... తెరపై అల్లు అర్జున్, తెర వెనుక దేవిశ్రీ హీరోలు. ఈ సినిమా చూసి అర్జున్ ప్రతి ఫ్యాన్ కాలర్ ఎగరేస్తాడు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మా సంస్థ స్థాపించి 14 ఏళ్లైంది. తొలి సినిమా ‘దిల్’. రెండో సినిమా ‘ఆర్య’. అప్పుడు నిర్మాతగా నేను, హీరోగా బన్నీ వేర్వేరు. సినిమా ట్రావెల్‌లో అరవింద్‌గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఒక్కటైంది. తర్వాత బన్నీతో చేసిన ‘పరుగు’ హీరోగా తనకు, నిర్మాతగా నాకు ఆరో సినిమా. మళ్లీ బన్నీతో చేయడానికి 9 ఏళ్లు పట్టింది. దీనికి కారణం కథే. ఇప్పుడీ ‘డీజే’ మా సంస్థకు 25వ సినిమా. ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 23న సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు. ఈ వేడుకలో బన్నీ కుమారుడు అయాన్ వేదికపైనుంచి అందరికీ నమస్కరించడం ప్రేక్షకుల్ని ఆకర్షించింది. అల్లు అర్జున్ భార్య స్నేహ, కుమార్తె అర్హ, చిత్ర బృందం పాల్గొన్నారు.