మళయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్కు 22 ఏళ్లు
పుట్టినరోజున కూడా సినిమాలను ఏమాత్రం వదిలిపెట్టని మళయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్. శనివారం ఆమె తన 22వ పుట్టినరోజు జరుపుకొంటోంది. అయితే, ప్రత్యేకంగా వేడుకలు, పార్టీలలో మునిగి తేలిపోకుండా.. ''ఒరు ఇండియన్ ప్రణయకథ'' (ఓఐపీ) అనే మళయాళీ చిత్రం షూటింగ్ కోసం రాజస్థాన్లోని జైసల్మీర్లో బిజీ బిజీగా గడుపుతోంది. ''జైసల్మీర్కు నేను మొదటిసారి వెళ్లాను! ఇక్కడ నేనో భయంకరమైన ప్రదేశంలో ఉన్నాను. ఎక్కడ చూసినా పెద్దపెద్ద రాజుల చిత్రాలే కనిపిస్తున్నాయి. ఈ గదిలో ఒకప్పుడు రాజులు ఉండేవారని ఎవరో చెబుతున్నారు. ఎప్పుడూ ఊహించలేని విషయాలు జరిగితే నాకు ఎంతో ఇష్టం'' అని అమలాపాల్ తన ట్విట్టర్ పేజీలో రాసింది.
ఫదా ఫాసిల్తో కలిసి ఆమె నటిస్తున్న ఓఐపీ చిత్రానికి సీనియర్ దర్శకుడు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. నాయక్, తలైవా, మైనా లాంటి చిత్రాలతో అమలాపాల్ దక్షిణాదిలో ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన 'వెలైయిల్ల పట్టతారి' అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది.