
అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్
ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులకు, నరసింహారెడ్డి అనుచరులకు జార్జియాలో యుద్ధం జరుగుతోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్తావన 18వ శతాబ్దంలో కదా? ఇప్పుడు ఎందుకు? అంటే ‘సైరా’ చిత్రం కోసం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
సైరా బృందానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులకు మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సుదీప్, విజయ్ సేతుపతిలు కూడా పాల్గొన్నారు. ఈ షూట్‌లో దాదాపు రెండువేల మూడువందల మంది పాల్గొంటున్నారని టాక్. స్పైడర్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... గురువారం అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. 76వ వసంతంలోకి అడుగుపెట్టారాయన. ఈ సందర్భంగా ‘సైరా’ చిత్రంలోని అమితాబ్ లుక్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ కనిపిస్తారట. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.