
'మిస్టర్ ఇండియా-2'లోనూ శ్రీదేవి, అనిల్ కపూర్!
ముంబై: అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన 'మిస్టర్ ఇండియా' సినిమా విడుదలై నేటికి 27 సంవత్సరాలు. బాలీవుడ్ క్లాసిక్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ సినిమాకు మళ్లీ సీక్వెల్ తీస్తే.. అందులో మళ్లీ హీరోహీరోయిన్లుగా నటించేందుకు అనిల్ కపూర్, శ్రీదేవి జోడీ నూటికినూరుపాళ్లు సరిపోతుందని ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ పేర్కొన్నారు.
'ఆ సినిమాకు వయస్సైంది కానీ అందులో ముఖ్య పాత్రలు పోషించిన నటులకు కాదు. 'మిస్టర్ ఇండియా'కు సీక్వెల్ తీయాలని బోనీ కపూర్ భావిస్తున్నారు. అందులో మళ్లీ అనిల్ కపూర్, శ్రీదేవీని హీరోహీరోయిన్లుగా పెడితే ఏ సమస్య ఉండదు. ఆ పాత్రలకు వారు ఇప్పుడు కూడా సరిపోతారు' అని ఆయన పేర్కొన్నారు. 17వ జియో మామి ముంబై చలనచిత్రోత్సవం సందర్భంగా 'మిస్టర్ ఇండియా' చిత్రయూనిట్ ఆనాటి జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకున్నది.