బీప్‌సాంగ్‌తోనే అనిరుద్ అవుట్
యువ సంగీత దర్శకుడు అనిరుద్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది నటుడు ధనుష్. 3 సినిమా ద్వారా రంగప్రవేశం చేసిన అనిరుద్‌కు ధనుష్ భార్య ఐశ్వర్యకు సోదరుడి వరస అవుతాడు. 3 సినిమా విజయం సాధించకపోయినా అందులోని 'వై దిస్ కొలై వెరి డీ' పాట అనిరుద్‌ను ఆకాశానికి ఎత్తేసింది. తర్వాత ధనుష్ ఆయనకు వరుసగా అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. మారి, వేలై ఇల్లా పట్టాదారి, తంగమగన్ చిత్రాలు వీళ్ల కాంబినేషన్‌లో వచ్చాయి. ధనుష్ తాజా చిత్రం కొడికి కూడా అనిరుద్‌నే సంగీతదర్శకుడిగా ఎంపిక చేశారు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా ఆ చిత్రం నుంచి అనిరుద్‌ను తొలగించి సంతోష్ నారాయణ్‌ను నియమించడం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారిం ది.
శింబు బీప్‌సాంగ్ వివాదంలో అనిరుద్ ఇరుక్కున్నాడనే వార్తలు వెలువడ్డ సమయంలో ధనుష్ ఆ ప్రచారాన్ని ఖండించాడు. అనిరుద్ తనకు చిన్నతనం నుంచి తెలుసని, అతడు అలాంటి పాటకు సంగీతాన్ని అందించి ఉండకపోవచ్చని అన్నాడు. అలాంటిది ఇప్పుడు తన సినిమా నుంచే అనిరుద్‌ను తొలగించడానికి కారణాలను కోలీవుడ్ ఆరాతీసే పనిలో పడింది. శింబు బీప్ సాంగ్ వివాదంలో అనిరుద్‌పై కూడా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ని పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం హోరెత్తుతోంది. ఈ వ్యవహారంలో శింబు మద్రాసు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ను పొందాడు. సంగీత కచేరీ కోసం కెనడా వెళ్లిన అనిరుద్ మాత్రం ఈ వివాదం చెలరేగి నెల రోజులు దాటినా చెన్నైకి తిరిగి రాకుండా కెనడా, లండన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన్ని మళ్లీ తన చిత్రానికి పెట్టుకుంటే తన ఇమేజ్‌కు దెబ్బ తగిలే అవకాశం ఉందని భావించిన ధనుష్ తన కొడి చిత్రం నుంచి తప్పించి సంతోష్ నారాయణ్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇదే అదనుగా భావించిన సంతోష్ నారాయణ్ తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు, బేరసారాల తర్వాత ముప్పావు కోటికి సెటిల్ అయినట్లు చెవులు కొరుక్కుంటున్నారు.