
రెండుసార్లు మిస్సయ్యా!
హీరోయిన్ అంజలి... పదహారణాల తెలుగమ్మాయి. తమిళ సినిమా వాకిట్లో... తెలుగు సిరిమల్లె చెట్టు.
హీరోయిన్ అంజలి... పదహారణాల తెలుగమ్మాయి.
తమిళ సినిమా వాకిట్లో... తెలుగు సిరిమల్లె చెట్టు.
‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’తో దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన అభినయాంజలి.
బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’తో ఈ 14న సంక్రాంతి వేళ... మన వాకిళ్ళలో బాక్సాఫీస్ ముగ్గు వేస్తున్న సౌందర్యాంజలి.
ఆమె ‘డిక్టేటర్’ అనుభవాలు... మనసులోని ముచ్చట్లలో మచ్చుకు కొన్ని...
బాలకృష్ణ గారితో ఇది నా మొదటి సినిమా. నిజానికి, గతంలో రెండుసార్లు ఆయనతో కలసి నటించే ఛాన్స్‌లు మిస్సయ్యా. ‘లెజెండ్’లో రాధికా ఆప్టే నటించిన పాత్రకు అడిగారు. కుదరలేదు. అలాగే, ‘లయన్’లో హీరోయిన్‌గా అడిగినప్పుడు డేట్స్‌ప్రాబ్లమ్. చివరికి ‘డిక్టేటర్’తో కుదిరింది.
మొదట భయపడ్డా! బాలకృష్ణ గారితో సినిమా అనగానే, ‘ఆయన పెద్ద హీరో. సెట్స్‌పై ఎలా ఉంటారో ఏమిటో’ అని భయపడిన మాట నిజం. అలాగే, బయట చాలామంది దగ్గర ఆయన గురించి విన్న మాటలతో టెన్షన్‌పడుతూ వెళ్ళాను. కానీ, బయట అనుకొనేదానికీ, నిజానికీ చాలా తేడా ఉంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. తోటి నటీనటులకు చాలా స్పేస్ ఇస్తారు. సెట్స్‌లో నటిస్తున్నప్పుడు మనకు మంచి టిప్స్ ఇస్తారు. మనం ఒకటికి రెండు టేక్‌లు తీసుకున్నా, విసుక్కోకుండా సహకరిస్తారు. హీరోయిన్ దగ్గర నుంచి లైట్‌మెన్ దాకా ప్రతి ఒక్కరితో బాగుంటారు. స్నేహంగా, జోవియల్‌గా ఉంటారు.
ఆయన దగ్గర అది నేర్చుకున్నా! కెమేరా ముందు ఎలా ఉండాలి, ఎమోషన్స్‌లో ఖాళీ వచ్చినప్పుడు వాటిని ఎలా భర్తీ చేసుకోవాలి లాంటి చాలా టిప్స్ ఆయన చెప్పేవారు. ఆయన దగ్గర నుంచి పంక్చువాలిటీ నేర్చుకున్నా. ఫలానా టైమ్‌కి షూటింగంటే, ఆయన షాట్ ఉందా, లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఆయన రెడీ అయి, కూర్చొనేవారు. పెద్ద హీరో ఆయనే రెడీగా ఉంటారని, దానికి భయపడి మిగిలినవాళ్ళందరం ఆ టైమ్‌కి సిద్ధంగా ఉండేవాళ్ళం.
♦ నేను ఒక డాక్టర్‌ను చేసుకొని, పిల్లను కనేశానని పుకారొచ్చింది. తాజాగా టీవీ యాంకర్ ఓంకార్ ‘రాజుగారి గది’ సీక్వెల్‌లో చేస్తున్నా ననీ, ఆయనతో సన్నిహితంగా ఉన్నాననీ నెట్‌లో రాశారు. అవన్నీ వట్టి పుకార్లే.
♦ నా సహ నటీనటులందరూ నాకు స్నేహితులే. సినిమాలు తెగ చూస్తాను. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా నటీనటులకు మెసేజ్‌లు కూడా పెడతాను.
అలా పిలవాలంటే కంగారుపడ్డా! తోటి నటీనటుల్ని బాలాగారెంత కంఫర్ట్‌గా ఉంచుతారంటే, నేను ‘బాలకృష్ణ గారూ, సార్’ అని పిలుస్తుంటే నన్ను పిలిచి, ‘కాల్ మి బాలా’ అన్నారు. నేను కంగారుపడిపోయి, అలా పిలవలేనన్నా. చివరికి ‘బాలా గారూ అని పిలుస్తా’ అన్నా. సరే అన్నారు. అలా సాన్నిహిత్యం పెరిగింది.
ఆయన అలా పోల్చడం నా అదృష్టం! ‘డిక్టేటర్’ చాలా మంచి స్క్రిప్ట్. రచయిత కోన వెంకట్ గారు కథ వినిపిస్తున్నప్పుడే అది అర్థమైంది. కథ రాస్తున్నప్పుడే ఈ పాత్రకు నేను బాగుంటానని పేరు రాసుకున్నారట. ఢిల్లీలో వర్కింగ్ గర్ల్‌గా నా పాత్ర యూత్‌ఫుల్‌గా, చలాకీగా బాగుంటుంది. పాత్ర పేరు విచిత్రంగా ఉంటుంది. బయటపెట్టలేను కానీ, సినిమాలో ప్రధాన భాగమంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పైగా, నాలోని నటనను హైలైట్ చేసే సీన్లు ఉన్నాయి. ఎడిటింగ్‌లో, ఆ తరువాత డబ్బింగ్‌లో అవి చూసిన బాలకృష్ణ గారు నన్ను ‘మహానటి సావిత్రి’తో పోల్చడం, అంత లెజండరీ యాక్టర్‌తో ఆ ప్రశంస అందుకోడం నా అదృష్టం!
ఫస్ట్ రోజే టెన్త్ ఎగ్జామ్! ఈ సినిమా సెట్స్‌కు వెళ్ళిన మొదటి రోజే పాట షూటింగ్. పైగా ‘గణ...గణ’ అనే మాస్ బీట్ పాట. అంతే! బాలా గారు మంచి ఎనర్జీతో స్టెప్స్ వేస్తున్నారు. నాకు టెన్ష నొచ్చింది. ఫస్ట్‌రోజే టెన్త్ ఎగ్జామ్ రాస్తున్నట్లనిపించింది. ‘ప్రాక్టీస్ చెయ్. నువ్వు రెడీ అయ్యాక చేద్దా’మని బాలా ప్రోత్సహించారు.
అయిదున్నర కిలోలు తగ్గా! ‘డిక్టేటర్’లో వర్కింగ్ గర్ల్ పాత్ర కాబట్టి, ఈ సినిమా అనుకున్నప్పుడే కొంచెం సన్నగా ఉండాలని దర్శక - నిర్మాత శ్రీవాస్ చెప్పారు. అందుకని ప్రత్యేకించి అయిదున్నర కిలోలు తగ్గా. హెయిర్‌స్టైల్, లుక్, శ్యామ్ కె. నాయుడు కెమేరా పనితనంతో తెరపై వేరే కొత్త అంజలిని చూడవచ్చు. ఫ్రెష్‌గా, యంగ్‌గా కనిపిస్తా.
ట్రాన్‌సజెండరూ కాదు... వేశ్యా కాదు..! ఇప్పుడు నా బేస్ హైదరాబాద్. ఇక్కడే ఉంటున్నా. తమిళ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నా కాబట్టి, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. తెలుగు-తమిళాల్లో ‘చిత్రాంగద’, తమిళంలో కార్తీక్ సుబ్బ రాజు ‘ఇరైవి’ లాంటివి రిలీజ్‌కు సిద్ధమవుతు న్నాయి. మమ్ముట్టి గారితో తమిళ చిత్రం ‘పేరన్బు’ షూటింగ్ మంగళవారం నుంచి. అందులో నాది ట్రాన్‌సజెండర్ పాత్ర అనీ, వేశ్య పాత్ర అనీ రాస్తు న్నారు. అది నిజం కాదు. కొత్తగా రెండు తెలుగు స్క్రిప్ట్స్ విన్నా. వాటికి సైన్ చేయాలి.