అతనితో మళ్లీ మొదలైంది!
‘అంతా అయిపోయింది.. ఇక ఆ ఇద్దరూ కలవడం కష్టం’ అని క్రికెటర్ విరాట్ కోహ్లి, నటి అనుష్కా శర్మల బంధం గురించి హిందీ రంగంలో చాలామంది ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే అందరికీ ఈ జంట ఓ ట్విస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం వరకూ ప్రేమికులుగా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత చిన్నపాటి మనస్పర్థలతో విడిపోయారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. బ్రేకప్ అయ్యి, ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమైనప్పటికీ తోడు లేని కొరత బాగా తెలుస్తోందట. ముఖ్యంగా అనుష్కా శర్మ తన జీవితానికి చాలా ముఖ్యమని విరాట్ అనుకుంటున్నారని వినికిడి.
అందుకే, ఆమె సోదరుడి ద్వారా మంతనాలు జరుపుతున్నారట. ఇలాంటిది ఏదో జరిగితే బాగుంటుందనుకున్నారో ఏమో.. అనుష్కా శర్మ కూడా మళ్లీ విరాట్‌తో మింగిల్ కావడానికి రెడీ అవుతున్నారని బోగట్టా. ఆ మధ్య విరాట్ ఓ క్రికెట్ మ్యాచ్‌లో పరుగుల మీద పరుగులు తీసిన వైనాన్ని ప్రశంసిస్తూ, ఆమె ఫోన్ చేసి, అభినందించారట. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. మరోసారి మనసులు కలవడం ఎంతసేపు? అని వీళ్ల వ్యవహారం తెలిసినవాళ్లు అనుకుంటున్నారు. మళ్లీ కలిస్తే మాత్రం ఈ ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏదో ఉందని ఫిక్స్ అయిపోవచ్చు.