సెలబ్రిటీల అన్న తర్వాత అవి తప్పవు!
ప్రముఖులుగా పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు ప్రశంసలతో నిందలూ తప్పవంటున్నాడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయని ఆయన భావిస్తున్నాడు. తనపై విమర్శలు వచ్చినా.. తనను తిట్టుకున్నా.. నలుగురు ప్రశంసించినా పెద్దగా చలించకుండా హుందాగా వ్యవహరించే ఈ బాలీవుడ్ మెగాస్టార్ తాజాగా ఓ దినప్రతికతో ముచ్చటించాడు.
'సృజనాత్మక రంగంలో ఉన్న వారిని ఉద్దేశించి కొన్నిసార్లు నిందాపూర్వకమైన కథనాలు వస్తూనే ఉంటాయి. ఇదొక చాలెంజ్. ఎదుర్కోక తప్పదు. మీరు పబ్లిక్ ఫిగర్ అని భావిస్తే ఇలాంటివాటికి సిద్ధపడాలి. వీటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్లాలి. సెలబ్రిటీగా ఉండి.. తమ గురించి ప్రజలు స్పందించుకూడదు అని అనుకోవడం సరికాదు. మీ కోసం కేకలు వేసి.. అరిచి.. ప్రశంసలు గుప్పించినప్పుడు వాటిని ఆనందంగా స్వీకరించి.. విమర్శలు వచ్చినప్పుడు 'మాపై ఇటుకలు వేయకండి' అని అనడం సరికాదు. విమర్శలను వినాలి. నాపై విమర్శలను వినడం ముఖ్యమైన విషయంగా నేను భావిస్తాను. విమర్శల వల్ల మన తప్పులు ఏమైనా ఉంటే తెలుస్తాయి. వాటిని నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది' అని బిగ్ బి చెప్పాడు.
తనపై చాలాసార్లు విమర్శలు వచ్చాయని, వాటిని మంచిగానే స్వీకరించానని అమితాబ్ చెప్పారు. 'నాపై విమర్శలు రావడం సహజం. ప్రతిరోజూ నువ్వు ఏం ధరించావు? ఏం చేశావు అన్నదానిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని నేను సానుకూలంగానే స్వీకరిస్తాను. ఎప్పుడూ మంచే చెప్పుకోవడం వల్ల వ్యక్తులు నాశనమవుతారు. ఎవరూ పరిపూర్ణులు కారు. అందరూ తప్పులు చేస్తారు' అని అమితాబ్ అన్నారు.