క్రికెట్ సే... సినిమా తక్! | Azharuddin's son debuts in Tollywood! | Sakshi
Sakshi News home page

క్రికెట్ సే... సినిమా తక్!

Published Mon, Apr 11 2016 10:30 PM | Last Updated on Wed, Oct 3 2018 7:14 PM

క్రికెట్ సే... సినిమా తక్! - Sakshi

క్రికెట్ సే... సినిమా తక్!

భారత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ తనయుడు అబ్బాస్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇందులో అబ్బాస్ సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారని భోగట్టా. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. నిర్మాత కె. సురేశ్‌బాబు ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారని సమాచారం. నిజానికి, అజరుద్దీన్ కుమారుడి అసలు పేరు - అసదుద్దీన్. తనను తాను అబ్బాస్‌గా చెప్పుకుంటారు. తండ్రి లానే అబ్బాస్ కూడా క్రికెట్ ఆడుతుంటారు. ‘హైదరాబాద్ అండర్-22’ టీమ్‌లో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడారు.

అయితే, మోచేతికి తగిలిన గాయంతో ఆటకు దూరమయ్యారు. ‘‘అందుకే, ప్రస్తుతం నటన మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఆ మాటకొస్తే, మొదటి నుంచి నా దృష్టి సినీ రంగం మీదే. సినిమాలంటే నాకు అంత పిచ్చి ప్రేమ. నటుణ్ణి కావాలనేది నా మనసులోని కోరిక’’ అని అబ్బాస్ చెప్పుకొచ్చారు. గమ్మత్తేమిటంటే, అజరుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్‌లానీయే తనకు స్ఫూర్తి అంటున్నారు అబ్బాస్. ‘‘సంగీతా ఆంటీ నటించిన సినిమాలు టీవీలో చూడడం నాకు స్ఫూర్తినిచ్చింది. రెండేళ్ళ క్రితమే ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించారు. మా నాన్న గారికి కూడా నచ్చింది. అయితే, అప్పటికి నేను సినీ నటనకు పూర్తిగా సిద్ధం కాలేదు.

ఇప్పుడు రెడీ’’ అని ఈ ఔత్సాహిక హీరో వ్యాఖ్యానించారు. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళని ఈ చిత్రానికి ‘ఇద్దరికీ కొత్తగా’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. అన్నట్లు, పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నడిచే ఈ సినిమాలో క్రికెట్ ప్రస్తావనలు మాత్రం ఉండే అవకాశం లేదట! నిజానికి, నటుడిగా తెర మీదకు రావడం ఇదే తొలిసారి అయినా, అబ్బాస్‌కు ఈ మధ్యే కొద్దిగా సినీ రంగ అనుభవం వచ్చింది.

తండ్రి అజరుద్దీన్ జీవితం ఆధారంగా తయారవుతున్న ‘అజర్‌‘ చిత్రానికి సహాయ దర్శకుడిగా అబ్బాస్ పనిచేశారు. సెట్స్‌లో చుట్టూతా బోలెడంతమంది టెక్నీషియన్లుండగా, నటీనటులు పనిచేస్తుంటే దగ్గర నుంచి చూడడం ఈ కుర్రాడికి చాలా ఉపయోగపడిందట! సినిమా రూపకల్పనకు సంబంధించిన విశేషాలను నేర్చుకొనేందుకు ఉత్సాహపడుతున్న అబ్బాస్ ఇటు నటుడిగా కూడా సత్తా చాటతారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement