రీ రిలీజ్లోనూ బాహుబలి రికార్డ్
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన బాహుబలి సినిమాకు సీక్వల్ రిలీజ్కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు వారాల్లో బాహుబలి 2 థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మరోసారి బాహుబలి మేనియా క్రియేట్ చేసేందుకు చిత్రయూనిట్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా బాహుబలి తొలి భాగం రిలీజ్ విషయంలో ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాజమౌళి టీం, తొలి భాగాన్ని కూడా మరోసారి భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం బాహుబలి ది బిగినింగ్ను రీ రిలీజ్లో 1000కి పైగా థియేటర్లలో ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఎక్కువ థియేటర్లు కేటాయించగా, తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో థియేటర్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కాటమరాయుడు హవా తగ్గిపోవటం, ప్రస్తుతం థియేటర్లో ఉన్న సినిమాలేవి పెద్ద సంఖ్యలో థియేటర్లు హోల్డ్ చేసే అవకాశం లేకపోవటం కూడా బాహుబలి రీ రిలీజ్కు కలిసొచ్చే అంశం.
యూట్యూబ్ అందుబాటులో ఉన్న బాహుబలి తొలి భాగం ఇప్పటికే చాలా సార్లు టీవీలోనూ ప్రసారమయ్యింది. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్లో అభిమానులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి. తొలి భాగాన్ని మించి మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి 2 ఏప్రిల్ 28 రిలీజ్ అవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్లు కీలక పాత్రలో నటిస్తున్న బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.