గౌతమీపుత్రుడితో ఢీ!
ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే కథానాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. అందుకే కథకు తగ్గ హీరోని ఎంపిక చేసే విషయంలో కేర్ తీసుకోవడంతో పాటు విలన్‌ని ఎంపిక చేసే విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటారు. భారతదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తాను రాసుకున్న కథ బాలకృష్ణకు మాత్రమే సూట్ అవుతుందనుకున్నారు క్రిష్. ఈ కథ విన్న బాలకృష్ణ తన నూరవ చిత్రానికి ఇలాంటి కథే కరెక్ట్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గౌతమీపుత్రుడికి దీటైన విలన్ కోసం క్రిష్ చాలా అన్వేషించారట.
ఫైనల్‌గా హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ అయితే బాగుంటుందని ఆయన్ను ఎంపిక చేశారని సమాచారం. స్వతహాగా మల్లయోధుడైన నాథన్‌కి నటుడిగా ‘ట్రాయ్’ మూవీ చాలా పేరు తెచ్చింది. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయన తమిళంలో ‘భూలోగం’ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘ఎ ఫ్లయింగ్ జాట్’లో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి ఎంపికయ్యారని ఫిలిం నగర్ టాక్. ప్రపంచాన్ని జయించాలనే ఆశయంతో దండయాత్రలు చేసే గ్రీకురాజుగా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ- నాథన్ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం.