కాంజీవరమంటే.. ప్రాణం
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్కు చీరలంటే ప్రాణం. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు ఈ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకుంది కూడా. అయితే ఇపుడామె తన జీవితంలో రెండుసార్లు భారీ ఆస్తిని సొంతం చేసుకున్నానని గర్వంగా ప్రకటిస్తోంది. ఒకటి తన తల్లిదండ్రులు ఇస్తే.... రెండోది తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఇచ్చాడట. ఏమిటబ్బా అంత గొప్ప సంపద అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా... ఆ రెండూ తనకెంతో ఇష్టమైన చీరలట. వాటిలో ఒకటి.. విద్యాబాలన్కు ఆమె అమ్మా నాన్న బహుమతిగా ఇచ్చిన గ్రీన్, పింక్ కాంబినేషన్తో ఉన్న కాంచీవరం పట్టుచీర. రెండోది తన శ్రీవారు కానుకగా ఇచ్చిన ఎరుపు రంగు బెనారస్ చీరట.
తనకు చీరలంటే చిన్నప్పటినుంచీ ఇష్టమనీ, తల్లి బీరువాలోని చీరలను చూసి మూడేళ్ల వయసపుడే మనసు పారేసుకున్నానంటోంది. బాల్యంలో అమ్మచీరలు కట్టుకొని దిగిన బోలెడన్ని ఫొటోలే దీనికి నిదర్శనమంటోంది. ఆరు గజాల చీరలంటే తనకు చచ్చేంత ఇష్టమని చెబుతోంది. తనదగ్గర దేశవ్యాప్తంగా లభించే కాటన్ చీరల పెద్ద కలక్షనే ఉందిట. జూన్ 19 వరల్డ్ ఎత్నిక్ డే సందర్భంగా క్రాఫ్ట్స్ విల్లా డాట్ కామ్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో విద్యాబాలన్ పాల్గొనబోతోంది. ఈ సందర్భంగా ఆమె తన మనోభావాలను వెలిబుచ్చింది.
పరిణీత సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రంచేసిన విద్యాబాలన్.. 'డర్టీ పిక్చర్' సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న 'హమారీ అధూరీ కహానీ' అనే బాలీవుడ్ మూవీలో ఇమ్రాన్ హష్మి, రాజ్కుమార్ రావు తదిరులతో కలిసి నటిస్తోంది.